8 July, 2026 | 2:42 AM

పొలమెళ్లిన ప్రాణం తిరిగిరాలేదు..

08-07-2026 12:46 AM
  1. పారుపల్లిలో విద్యుత్ ఘాతానికి కౌలు రైతు బలి
  2. ముత్తారం మండలంలో విషాదం
  3. అనాథలైన భార్యాపిల్లలు

ముత్తారం, జూలై 7 (విజయక్రాంతి) : ఉదయం ఎప్పటిలాగే కుటుంబ సభ్యులకు చెప్పి పొలం పనుల కోసం వెళ్లిన రైతు సాయంత్రానికి తిరిగి వస్తాడని ఎదురుచూసిన కుటుంబానికి.. ఆయన శవమై చేరడంతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామ పంచాయతీలోని శాలగుండ్లపల్లి  సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రమాదం జరిగిందిలా..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తారం గ్రామానికి చెందిన కౌలు రైతు తన కౌలు తీసుకున్న వ్యవసాయం తీసుకున్న భూమి వద్ద మారం వెంకట్ రెడ్డి (45) మంగళవారం ఉదయం తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. మోటార్ నిర్వహణ కోసం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేయడానికి ప్రయత్నించిన ఆయన, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిందని భావించి కిందకు దిగే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన వెంకట్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

దిక్కుతోచని స్థితిలో కుటుంబం..

వ్యవసాయమే జీవనాధారంగా కుటుంబాన్ని పోషిస్తున్న వెంకట్ రెడ్డి అకాల మరణంతో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో మిగిలారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన వ్యక్తి ఇలా హఠాత్తుగా దూరమవడంతో బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. వెంకట్ రెడ్డి మరణంతో ముత్తారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

భద్రతా ప్రమాణాలు పాటించాలి : గ్రామస్థుల డిమాండ్

రైతులు విద్యుత్ పరికరాల వద్ద పని చేసే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండేలా అధికారులు అవగాహన కల్పించాలని, వ్యవసాయ విద్యుత్ వ్యవస్థల్లో భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. మృతినికి భార్య కవిత, కుమారుడు, కూతురు ఉన్నారు.ఈ  ఘటనపై పోలీసులు కుటుంబ సభ్యుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.