26 August, 2026 | 1:26 AM

ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

26-08-2026 12:10 AM

బాధితుడికి అత్యవసర వైద్యం, ఆర్థిక సహాయం

పరిసర గిరిజన ఆవాసాల్లో అవగాహన, గస్తీ పెంపు

కొత్తగూడెం,(విజయక్రాంతి): రామవరం అటవీ రేంజ్ పరిధిలోని పెనగడప సెక్షన్, సత్యంపేట బీట్, కంపార్ట్‌మెంట్ నం. 19లో, అడవి ఎలుగుబంటి దాడి ఘటన చోటుచేసుకుంది. సత్యంపేట బీట్ పరిధిలోని సండ్రకుంట గ్రామ సరిహద్దు ప్రాంతంలో ఉన్న,జగ్గారం గోత్తికోయ నివాస ప్రాంతానికి చెందిన మడకం సింగయ్య, తండ్రి దేవయ్యపై అడవి ఎలుగుబంటి దాడి చేసినట్లు సమాచారం అందింది. ఘటనపై సమాచారం అందిన వెంటనే రామవరం రేంజ్ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై ఎటువంటి ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

గాయపడిన మడకం సింగయ్యకు తక్షణ సహాయం అందించి, అవసరమైన ప్రాథమిక చర్యలు చేపట్టి సురక్షితంగా కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు ఎంజిఎంకు తరలించారు. అవసరమైన ఏర్పాట్లను అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేపట్టారు. బాధితుడి వెంట బీట్ అధికారులు రాము రమేష్ లు సహాయకులుగా వెళ్లారు. బాధితుడి చికిత్సకు అటవీ శాఖ చేయూతను అందించి, అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి  పూర్తి భరోసాను కల్పించారు.

 ఘటనపై ప్రత్యేక పర్యవేక్షణ

ఎలుగుబంటి దాడి జరిగిన ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పరిశీలించారు. ఎలుగుబంటి సంచారం, దాని కదలికలకు సంబంధించిన ఆనవాళ్లు మరియు ఘటనకు దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. సత్యంపేట బీట్‌తో పాటు పరిసర అటవీ ప్రాంతాలు, గిరిజన  గోత్తికోయ ఆవాసాల సమీపంలో పర్యవేక్షణ, గస్తీని మరింత ముమ్మరం చేశారు. అడవి  పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండి, అటవీ శాఖ సూచనలను పాటిస్తూ వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.