26 August, 2026 | 1:26 AM

ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేయొద్దు

26-08-2026 12:00 AM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): ప్రభుత్వం అందించే పథకాలను దుర్వినియోగం చేయవద్దని,అన్ని గ్రామాల సర్పంచులు,అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.అర్వపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్ధ్య వృద్ధి కార్యక్రమాలపై మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామపంచాయతీలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులతో సమీక్షించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, త్రాగునీరు, రహదారులు తదితర ప్రజా అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గ్రామపంచాయతీలను మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన పాలనా సేవలు అందించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామ సర్పంచ్ కర్నాటి వెంకన్న జూన్ నెలలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను 17 గ్రామపంచాయతీలకు గాను బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాలకు కేటాయించకుండా 8 గ్రామపంచాయతీలకే కేటాయించారని అన్ని గ్రామాలకు సమానంగా నిధులు మంజూరు చేయించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ఇకనుంచి అలాంటి పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు చూసుకోవాలని సూచించారు.

అలాగే ఎస్సారెస్పీ కాలువల ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సర్పంచులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.అనంతరం వన మహోత్సవంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఝాన్సీ,డీఏఓ శ్రీధర్ రెడ్డి,తహసీల్దార్ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి,డీసీసీ కార్యదర్శి వేల్పుల రమేష్,వివిధ శాఖల అధికారులు,వివిధ గ్రామాల సర్పంచులు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.