18 July, 2026 | 1:28 AM

భూ రీ-సర్వే పారదర్శకంగా నిర్వహించాలి

18-07-2026 01:17 AM

కలెక్టర్ దివాకర టిఎస్

ఖమ్మం/ తిరుమలాయపాలెం, జూలై- 17(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూ రీ-సర్వే కార్యక్రమాన్ని అధికారులు సమగ్రంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశించారు. శనివారం పాలేరు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సర్వే నిర్వహణ తీరును పరిశీలిస్తూ రైతులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సర్వే ప్రక్రియపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలు, సమస్యలను ఓర్పుతో విని వాటిపై స్పష్టమైన వివరణ ఇచ్చి నివృత్తి చేశారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పట్టాదారు భూమిని సంబంధిత భూ యజమానులు, రైతుల సమక్షంలోనే సర్వే చేసి, సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా ప్రతి అంశాన్ని నిబంధనల ప్రకారం నమోదు చేయాలని సూచించారు.

సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. భూ రీ-సర్వేపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం అధికారుల బాధ్యత అని కలెక్టర్ అన్నారు. ఆనతరం తిరుమలాయపాలెం మండలంలో సీతారామ ప్రాజెక్టు లో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ పనులను కలెక్టర్ పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ విల్సన్, ఇర్రిగేషన్ డిఈ రమేష్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సుధీర్, సర్వే అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.