అబ్కారీలో వసూల్ రాజాలు!?
- నెలనెలా మామూళ్లపై సీఐ, ఎస్‌ఐల మధ్య ఆధిపత్య పోరు
- వైన్‌షాపులు, బార్లు, పబ్‌లపై కేసుల పేరుతో వేధింపులు
- ఒకరికి తెలియకుండా..మరొకరు తనిఖీల బెదిరింపులు
- అబ్కారీ శాఖ ఉన్నతాధిరులకు ఫిర్యాదులు
- ఎక్సైజ్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ఏసీబీ
- అవినీతి, అధికారులు జాబితా రెడీ!
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): మద్యం విక్రయాల్లో అక్రమాలు, దాందాలను నివారించాల్సిన అబ్కారీ శాఖలో వసూలు రాజాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. నెలనెలా మామూళ్లపై ‘నువ్వా.. నేనా?’ అంటూ రచ్చర్చ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వసూళ్లకు సంబంధించి సీఐలు, ఎస్‌ఐల మధ్య అంతర్గత దందా వార్ నడుస్తోంది. ఒకరికి తెలియ కుండా మరొకరు తనిఖీల పేరుతో బార్, వైన్‌షాపులు, పబ్‌ల యజమానుల నుంచి అందినకాడికి దండుకుంటున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం రంగా రెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి ఎస్‌ఐలు, సీఐల మధ్య వసూళ్ల పంచాయితీ అధికం కావడంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే వరకూ వెళ్లినట్టుగా గుసగు సలు వినిపిస్తున్నాయి. దీంతో సీఐలు, ఎస్‌ఐల మధ్య ఆధిపత్య పొరు పతాకస్థాయికి చేరుకుందనే ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా నెలనెలా మామూళ్లు ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తామని స్థానిక వైన్‌షాపు, బార్ యజమానులను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులు ఆ శాఖ ఉన్నతాధికారులకు అందుతున్నాయి.
రాష్ట్రంలో 2,640 వైన్‌షాపులు ఉన్నాయి. ఈ షాపుల నుంచి స్థానికంగా డిమాండ్‌ను బట్టి ప్రతి నెలా ఎక్సైజ్ శాఖ అధికారులకు ముడుపులు ముట్టచెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు అధికారులు నెలనెలా ఇచ్చే మామూళ్లే కాకుండా అదనంగా వసూళ్లకు పాల్పడుతుండటంతోనే పంచాయితీలు నడుస్తున్నాయనే సంబంధిత శాఖలోనే చర్చ జరుగుతోంది.
ఇది ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని సంబంధిత వర్గాలే చెబుతున్నాయి. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో పని చేస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు మరింత రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శంషాబాద్ డీటీఎఫ్ సీఐగా పనిచేస్తున్న ఒక అధికారి, శేరిలింగంపల్లి పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఒక సీఐపైన అబ్కారీ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా సమా చారం.
ఇక చేవెళ్ల పరిధిలో పనిచేసే ఒక సీఐ విధులకు ఉదయం వచ్చి అటెండెన్స్ రిజిస్ట్రర్‌లో సంతకం పెట్టి ఇంటికి వెళ్లుపోతున్నారనే ఫిర్యాదులు ఆ శాఖ ఉన్నతాధికారులకు అందాయి. అంతేకాకుండా చేవెళ్ల పరిధిలోని ఫాంహౌస్‌లో జరిగే పార్టీలపై సదరు సీఐ దృష్టి సారించడం లేదని, ఆయా పార్టీల్లో విదేశీ మద్యం, డ్రగ్స్‌ను వినియోగిస్తుంటారని ఫిర్యాదులు అందినా సదరు సీఐ తనిఖీలు చేయకపోవడంతో పాటు అవినీతి ఆరోపణలు అధికమయ్యాయి.
ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరించినా ఆ సీఐ తీరులో మార్పు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలానగర్, కుత్బు ల్లాపూర్ పరిధిలో పనిచేసే ఎక్సైజ్ సీఐలు మామూళ్ల మత్తులో తూగుతున్నారని, తనిఖీల పేరుతో తమను ఇబ్బందులు పెడు తున్నారని వైన్‌షాప్‌లు, బార్ల యజమానులు ఆ శాఖ ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఇక మేడ్చల్ పరిధిలో పనిచేసే ఒక ఈఎస్ స్థాయి అధికారి కూడా తనకు ఉన్నతాధికారులకు అతిదగ్గరగా ఉన్నారంటూ.. తన పరిధిలో పనిచేసే సీఐ, ఎస్‌ఐలకు టార్గెట్ పెట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా సమాచారం.
ఇక వరంగల్, హన్మకొండ, ములుగు పరిధుల్లో పనిచేసే ముగ్గురు సీఐలపై కూడా అవినీతి ఆరోపణలు అధికంగా వచ్చినట్టుగా తెలిసింది. శంషాబాద్ పరిధిలో పనిచేసే ఇద్దరు ఎస్‌ఐలు, కుత్బుల్లాపూర్ పరిధిలోని ఒక ఎస్‌ఐ, బాలానగర్ పరిధిలోని మరో ఎస్‌ఐ తనిఖీల పేరుతో వైన్‌షాపుల యజమానులను బెదిరిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు హైదరాబాద్ పరిధిలోని దూల్‌పేట్ ప్రాంతంలో పనిచేసే ఎస్‌ఐలు, సీఐలకు ఈ ప్రాంతం ఆదాయ వనరుగా మారిందని, కేసుల పేరుతో స్థానికులను బెదిరిస్తున్నారని ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది.
త్వరలో అబ్కారీ శాఖలో జరిగే బదిలీల్లో చాలామంది సీఐలు, ఎస్‌ఐలపై వేటు పడే అవకాశం ఉంద ని, వారిపై వచ్చిన ఫిర్యాదులను కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఎక్సైజ్ శాఖలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ అప్పనంగా సంపాదిస్తున్న వారిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ప్రత్యేకదృష్టి సారించినట్లు సమా చారం. అవినీతి, అక్రమార్కులు జాబితాను కూడా సిద్ధం చేశారని, ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉందని సంబంధిత శాఖలోనే చర్చ జరుగుతోంది.






