7 August, 2026 | 10:26 PM

సీనియర్ సిటిజన్స్‌కు ఎన్ని భవనాలు?

07-08-2026 09:30 PM

మేడిపల్లి మండలంలో ఇప్పటికే రెండు భవనాలు

మరో భవనం నిర్మాణంపై స్థానికుల విమర్శలు

మేడిపల్లి,(విజ‌య‌క్రాంతి): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలంలో సీనియర్ సిటిజన్ల కోసం ఇప్పటికే రెండు భవనాలు నిర్మిస్తుండ‌గా మరో భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడంపై ప‌లువురు స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, ప్రజాధనాన్ని అవసరాలకు అనుగుణంగా వినియోగించాల్సిన సమయంలో ఒకే మండలంలో మూడు సీనియర్ సిటిజన్ భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

ప్రజల అత్యవసరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ స్థ‌లాలు, నిధులను దుర్వినియోగం చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడిపల్లి మండలంలోని పీఅండ్‌టీ కాల‌నీలో పార్కు ద‌గ్గ‌ర రూ.40 ల‌క్ష‌ల అంచ‌నా వ్య‌యంతో, బుద్ధానగర్ కాలనీలోని రోడ్ నంబర్–2లో 30 ల‌క్ష‌ల అంచ‌నా వ్య‌యంతో 2025 జనవరి 1న శంకుస్థాపన చేశారు. ఈ భవనాల నిర్మాణాల కోసం అప్పటి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేయ‌గా ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి.

భవనాలు పూర్తయిన తర్వాత మండలంలోని వృద్ధులకు సమావేశాలు, ఆరోగ్య శిబిరాలు, వినోద కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు అప్పట్లో ప్రకటించారు. ఇది ఇలా ఉండ‌గానే మేడిపల్లి మండల కేంద్రంలోని సర్వే నంబర్–103లో సుమారు 1000 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో మరో సీనియర్ సిటిజన్ భవనానికి బేస్‌మెంట్ నిర్మాణం ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రెండు భ‌వ‌నాలు నిర్మాణంలో ఉండగా మరో భవనం అవసరం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఒకే మండ‌లంలో వారికి ఎన్ని భ‌వ‌నాలు నిర్మిస్తార‌ని నిల‌దీస్తున్నారు. పేద‌ల ఇళ్ల‌ కోసం ఈ ప్ర‌భుత్వ స్థ‌లాన్ని కేటాయించ‌కుండా ప్ర‌జాధ‌నాన్ని, స్థ‌లాల‌ను వృథా చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు.  ఒకే మండలంలో ఒకే అవసరానికి రెండు భవనాలు నిర్మించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అధికారులు వెల్లడించాలని కోరుతున్నారు. ప్ర‌జా అవసరాలను గుర్తించ‌కుండా ప్ర‌భుత్వ భూములు, ధ‌నాన్ని దుర్విన‌యోగం చేయడాన్ని త‌ప్పుబ‌డుతున్నారు.

సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం మూడు భ‌వానాలు అవ‌స‌రమా?

ఒకే మండ‌లంలో సినియ‌ర్ సిటిజ‌న్ల కోసం మూడు భ‌వ‌నాలు ఎందుకు నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ పాల‌క‌వ‌ర్గం ఉన్న‌ప్పుడు పీఅండ్‌టీ కాల‌నీ, బుద్ధాన‌గ‌ర్ రోడ్ నెంబ‌ర్‌-2లో 2025 జ‌న‌వ‌రిలో రెండు భ‌వ‌నాల‌కు మాజీ మేయ‌ర్ అమ‌ర్ సింగ్ ఆధ్వ‌ర్యంలో శంకుస్థాప‌నలు చేశారు.

ఆ రెండు భ‌వ‌నాల నిర్మాణాలు దాదాపు పూర్తి కావొస్తున్నాయి. ఇప్పుడు స‌ర్వే నెంబ‌ర్ 103లో మ‌రో సీనియ‌ర్ సిటిజ‌న్ భ‌వ‌నం కోసం 1000 చ‌.గ‌జాల స్థ‌లంలో బేస్‌మెంట్ నిర్మాణం చేప‌డుతున్నారు. దీనిని పేద‌ల ఇళ్ల కోసం కేటాయించాలి. ప్ర‌భుత్వ స్థ‌లాలు, ప్ర‌జాధ‌నం దుర్వినియోగం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి.