సాగర్ ఎడమ కాలువకు వెంటనే నీరు విడుదల చేసి చెరువులు నింపాలి
* భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.. రైతులను ఆదుకోవాలి
* నాగార్జునసాగర్ ఆయకట్టు పరిరక్షణ సమితి వ్యవస్థాపక సభ్యులు సప్పిడి శంబి రెడ్డి
గరిడేపల్లి,(విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితులతో నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలను నింపాలని నాగార్జునసాగర్ ఆయకట్టు పరిరక్షణ సమితి వ్యవస్థాపక సభ్యులు సప్పిడి శంబిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయని, బోర్లు, బావులు ఎండిపోవడంతో రైతులు, గ్రామీణ ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసి అక్కడి రైతులను ఆదుకోవడం స్వాగతించదగ్గ విషయమేనని, అదే విధంగా ఎడమ కాలువ పరిధిలోని తెలంగాణ రైతుల సమస్యలను కూడా ప్రభుత్వం సమానంగా పరిగణించాలని కోరారు. సాగర్ ఎడమ కాలువ కింద లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, నీటి విడుదల లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వరి నాట్లు ఆలస్యమయ్యాయని, మరికొన్ని ప్రాంతాల్లో నాటిన పంటలు నీటి కొరతతో ఎండిపోయే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
రైతులు అప్పులు చేసి వ్యవసాయం ప్రారంభించినప్పటికీ సాగునీరు అందక పెట్టుబడులు వృథా అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.సాగర్ ఎడమ కాలువకు వెంటనే విడతల వారీగా నీటిని విడుదల చేసి మార్గమధ్యంలోని చెరువులు, కుంటలను నింపితే భూగర్భ జలాలు పెరగడంతో పాటు తాగునీటి సమస్య కూడా కొంతవరకు పరిష్కారమవుతుందని సూచించారు. రైతుల సమస్యల విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఎడమ కాలువ పరిధిలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.






