15 June, 2026 | 4:54 AM

కండ్లకోయ రహదారిని పునరుద్ధరించాలి

15-06-2026 01:00 AM

ప్రొఫెసర్ డాక్టర్ బి. రతన్ రెడ్డి

మేడ్చల్, జూన్ 14 (విజయ క్రాంతి):   కండ్లకోయ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 135, 136లో ఉన్న 40 అడుగుల ప్రజా రహదారిని వెంటనే శాశ్వతంగా పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురా వాలని ప్రొఫెసర్ డాక్టర్ బి. రతన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా దేవరయాంజల్, కండ్లకోయ, మునీరాబాద్ గ్రామాల ప్రజలు వినియోగిస్తున్న ఈ రహదారికి పలువురు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు.

పలుమార్లు ప్రభుత్వ సంస్థలు పునరుద్ధరించినప్పటికీ కొంతమంది తరచూ గుంతలు తవ్వి రోడ్డు ధ్వంసం చేస్తున్నారన్నారు. పహాణీ, అడంగల్, గ్రామ సర్వే మ్యాపులు, రెవెన్యూ రికార్డుల్లో కూడా ఈ రహదారి 40 అడుగుల వెడల్పుతో నమోదై ఉందన్నారు.ఈ మార్గం ద్వారా టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ సబ్స్టేషన్తో పాటు ప్రతిపాదిత మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కోర్టు సముదాయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, జిల్లా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

గతంలో తుముకుంట మున్సిపాలిటీ, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలు ఈ రహదారిని పలు మార్లు పునరుద్ధరించాయని తెలిపారు. అనంతరం హైడ్రా కూడా రెండు సార్లు రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిం దన్నారు. అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.కోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ రికార్డులు ప్రజా రహదారిగానే నిర్ధారిస్తున్నాయన్నారు.