రైల్వే ట్రాక్‌మెన్ల సమస్యలు పరిష్కరించాలి
రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి
మహబూబాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): భారతీయ రైల్వే భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజినీరింగ్ ట్రాక్ మెన్ల పని పరిస్థితులను మెరుగుపరచాలని, పాతకాలపు వర్కింగ్ మ్యానువల్స్ను సవరించాలని కోరుతూ మజ్దూర్ యూనియన్ ప్రతినిధుల బృందం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ శివగోపాల్ మిశ్రాను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు ట్రాక్ మెన్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. బ్రిటీష్ కాలం నాటి నిబంధనలతో నేటికీ ట్రాక్ మెన్లపై పనిభారం మోపడం అన్యాయమని, పెరిగిన రైళ్ల వేగం, సాంకేతికతకు అనుగుణంగా నిబంధనలు మార్చాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలం వర్కింగ్ మ్యానువల్స్ మార్చాలని, పని గంటలను రోజుకు 6 గంటలకు పరిమితం చేయాలని కోరారు.
ట్రాక్ మెన్లను ‘టెక్నికల్ కేడర్’గా గుర్తించి, వారి ఎంట్రీ లెవల్ గ్రేడ్ పే1,800 నుండి 1,900కు పెంచాలని, పదోన్నతుల్లో కోటాను పెంచి, సీనియర్లకు ఇతర విభాగాల్లోకి మారే అవకాశం కల్పించాలన్నారు. పెరుగుతున్న మహిళా ట్రాక్ మెన్ల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు, మొబైల్ బయో, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, నెలకు 3 రోజుల ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని, ఇతర డిపార్ట్మెంట్ లో వన్ టైం ట్రాన్సఫర్ అవకాశం కల్పించాలి అని కోరారు. ట్రాక్ మెన్ల ప్రాణరక్షణ కోసం ’రక్షక్’ పరికరాలు ఇవ్వాలని, రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ను బేసిక్ పేలో 30 శాతానికి పెంచాలని, సైకిల్ అలవెన్స్ స్థానంలో మోటార్ సైకిల్ అలవెన్స్ అందించాలన్నారు.
ఆఫీసర్ల బంగళాల్లో పనులకు ట్రాక్ మెన్లను ఉపయోగించడాన్ని వెంటనే నిలిపివేయాలని, రైల్వే వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడే ట్రాక్ మెన్లను కేవలం కూలీలుగా కాకుండా ‘సాంకేతిక సంరక్షకులు’గా గుర్తించాలని యూనియన్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీధర్, సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్, అసిస్టెంట్ డివిజనల్ సెక్రెటరీ చిలుకు స్వామి, సెక్రెటరీలు యుగంధర్ యాదవ్, రాజేందర్, సంపత్, అంజి యాదవ్, సాంబాశివుడు, చైర్మన్లు రాజయ్య, బిక్షపతి, సురేష్, రమేష్ బాబు, కృష్ణయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.






