5 July, 2026 | 1:45 PM

నాన్నల పేరిట పురస్కారాలు

05-07-2026 12:46 PM

కరీంనగర్,(విజయక్రాంతి): భారతీయ సంస్కృతి "మాతృదేవో భవ, పితృదేవో భవ" అని బోధించింది.  ఈ భోదనతో తల్లిదండ్రుల పేరిట పురస్కారాలు అందించే కార్యక్రమానికి  రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్, కరీంనగర్ మాజీ జేసీజీవీ శ్యాంప్రసాద్ లాల్ శ్రీకారం చుట్టారు. కరీంనగర్ ఫిలిం భవన్ లో సమైక్య సాహితి ఆధ్వర్యంలో తండ్రుల పేరిట అందజేస్తున్న విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి తండ్రులను దేవతలతో సమానంగా భావించే మన సంస్కృతి లో వారి పేరును సేవతో, సత్కార్యాలతో, సన్మానాలతో చిరస్థాయిగా నిలబెట్టడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. నాన్న ల పట్ల ప్రేమను కేవలం భావోద్వేగంగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యక్తీకరించడం నిజంగా ప్రశంసనీయమని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు, గద్దర్ పురస్కార గ్రహీత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఋణం ఎన్నటికీ తీర్చలేనిదని వారి పేరు సమాజంలో గౌరవంగా నిలిచేలా చేయడం, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, వారి విలువలను భావితరాలకు అందించడం నిజమైన ప్రేమ అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సంస్థ అధ్యక్షులు మాడిశెట్టి గోపాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాన్నల పేరిట అందించే ఈ పురస్కారాలు సంస్థకు ఎంతో గర్వకారణమని అన్నారు. ముందుగా నంది శ్రీనివాస్ రూపొందించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ పురస్కార ప్రదాత గా వ్యవహరించే ఆచార్య రజనిశ్రీ నృత్య పురస్కారాన్ని ప్రముఖ నృత్య కళాకారులు, అధ్యక్షులు ఆదివాసీ నృత్య నికేతన్ జె. రతన్ కుమార్ కు ప్రదానం చేశారు. సీనియర్ ఫిజీషియన్ డా. డి. రఘురామన్ అందిస్తున్న డాక్టర్ దారం నాగభూషణం పురస్కారాన్ని, ప్రముఖ చరిత్ర పరిశోధకులు, కవి కరిపె రాజ్ కుమార్ కు ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని సమైక్య సాహితి అధ్యక్షులు మాడిశెట్టి గోపాల్ ప్రదాత గా అందజేసే మాడిశెట్టి మల్లయ్య ఉపాధ్యాయ పురస్కారాన్ని అసోసియేట్ ప్రొఫెసర్, ఛైర్మన్ బోర్డు ఆఫ్ స్టడీస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ప్రొ. ఎస్. రఘు కు అందజేశారు.