5 July, 2026 | 3:30 PM

హెచ్‌ఎండీఏ మైదానంలో రాష్ట్ర స్థాయి హస్తకళల ప్రదర్శన

05-07-2026 02:29 PM

హైదరాబాద్: ఆషాఢ బోనాల మహోత్సవాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ (పెద్ద అంబేద్కర్ విగ్రహం పక్కన)లో రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన–అమ్మకాల మేళాను  తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బోనాల పండుగకు అవసరమైన అన్ని రకాల సంప్రదాయ వస్తువులు ఒకే వేదికపై ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ మేళాను ఏర్పాటు చేశామని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చేతివృత్తుల వైభవాన్ని ప్రతిబింబించే ఈ మేళా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాకారులకు గొప్ప వేదికగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమాన్ని సెర్ప్ (SERP) ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, నేత కళాకారులు, బంగారు పనివారు, రాతి శిల్పులు, బుట్టల తయారీదారులు, తోలు కళాకారులు తదితర సంప్రదాయ కులవృత్తుల వారికి తమ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించే అవకాశం కల్పిస్తున్నాం. గత ఏడాదికంటే ఈసారి మరింత ఎక్కువ మంది కళాకారులకు అవకాశం కల్పిస్తూ అధిక సంఖ్యలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

 బోనాల సందర్భంగా అవసరమయ్యే మట్టి బోనం కుండలు, మట్టి దీపాలు, వెదురు బుట్టలు, గంపలు, జల్లెడలు, పిత్తళి, రాగి చెంబులు, కలశాలు, ఘటాలు, గంటలు, పూజా సామగ్రి, పూల దండలు, తోరణాలు, బోనం అలంకరణ వస్త్రాలు, గాజులు, పూసల అలంకరణ సామగ్రి, పోతురాజు ఉపయోగించే కొరడాలు, కాళ్ల గజ్జెలు, డప్పులు, డోలు వంటి సంప్రదాయ వాద్యాలు, చెక్కతో తయారుచేసిన పూజా పీటలు, మండపాలు తదితర అనేక వస్తువులు ఈ మేళాలో అందుబాటులో ఉంటాయి.

బోనాల పండుగ వేలాది మంది సంప్రదాయ చేతివృత్తి కళాకారులకు ఉపాధిని కల్పించే మహోత్సవం. ఈ మేళా వారి ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడమే కాకుండా, వారి ఆదాయాన్ని పెంచి, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజా ప్రభుత్వం చేతివృత్తుల పరిరక్షణకు, సంప్రదాయ కళాకారుల జీవనోపాధి బలోపేతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం.

బోనాల సందర్భంగా నగరానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఈ మేళాను సందర్శించి చేతివృత్తుల ఉత్పత్తులను కొనుగోలు చేసి కళాకారుల కుటుంబాలకు అండగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మనం కొనుగోలు చేసే ప్రతి చేతి ఉత్పత్తి ఒక కళాకారుడి కుటుంబానికి భరోసా, ఒక సంప్రదాయ వృత్తికి జీవం. తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ చేతివృత్తులకు కొత్త ఊపునిచ్చే ఈ రాష్ట్రస్థాయి మేళాను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.