5 July, 2026 | 1:11 PM

చెట్లను నరికిన వారికి వాల్టా చట్టం వేటు వేసేనా..?

05-07-2026 12:40 PM

నరికిన చెట్లను తొలగించేదెవరు

ప్రమాదాలు జరిగితే తప్ప స్పందించరా

చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి మండలంలోని మల్యాల గ్రామం నుండి వెళ్లే  వేములవాడ నుండి కోరుట్ల కు వెళ్లే ప్రధాన రహదారి ప్రక్కన చెట్లను నరికివేసి దాదాపుగా నెల రోజులు కావస్తున్న నరికి వేసిన చెట్లను రోడ్డుపైనే ఉంచారు. కనీసం ఆ నరికి వేసిన  చెట్లను పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. నరికి వేసిన చెట్లకు వాల్టా చట్టం క్రింద జరిమానా విధించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతి ఏటా  రోడ్డు పక్కన ఇష్టం వచ్చిన రీతిలో  బిల్లుల కోసం నియమ నిబంధనలను పాటించకుండా మొక్కలు నాటుతున్నారు.

మొక్కలు వేపుగా పెరిగి పెద్దవైన తరువాత సెస్ సిబ్బంది కరెంటు తీగలకు తగులుతున్నాయని  నరికి వేస్తున్నారు. అలాగే మండలంలోని సనుగుల నుండి దేవుని తండా జలపతి తండా వెళ్లే రహదారి ఇరువైపులా దాదాపుగా 100 చెట్లను నరికి వేసిన అటువైపు కన్నెత్తి చూడని అధికారులు ఉన్నారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా చందుర్తి మండలం లో అధికారులు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు చెబుతున్నారు, పర్యావరణ పరిరక్షణలో మండలంలోని అధికారుల సమన్వయ లోపం లోపించిందని, ఈ చెట్లు నరికేసిన వారికి వాల్టా చట్టం పనిచేస్తుందా లేదా అని స్థానికులు విమర్శిస్తున్నారు, ఈ నరికి వేసిన చెట్లు ఏమైనా ప్రమాదాలు జరిగితే తప్ప తొలగించరా అని పర్యావరణ పరిరక్షకులు మండిపడుతున్నారు.