08-02-2026 01:17:05 AM
బీజేపీ వినూత్న ప్రచారం
పార్టీ ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నేతలకు కీలక బాధ్యతలు
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి ): మున్సిపల్ ఎన్నికల్లో ఒకవైపు బీఆర్‌ఎస్, మరోవైపు కాంగ్రెస్ నేతలు బీజేపీపై ఘాటైన విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే వాటిని తిప్పికొట్టేందుకు అదేస్థాయిలో సరికొత్త ప్రచార ఎత్తుగడను, సరళిని ఎంచుకుంది. మాకూ అవకాశమివ్వాలని ప్రజలను వేడుకుంటోంది. పైసలు మావి...ప్రగతి మాది... ఓటు కూడా మాకే వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తోంది.
గ్రామాలకు, మున్సిపాలిటీలకు నిధులిచ్చేదే కేంద్ర ప్రభుత్వమని ప్రజ లకు వివరించే ప్రయత్నం చేస్తోంది. తామిచ్చే నిధులతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతోందని పేర్కొంటోంది. సేవ్ తెలంగాణ ఫర్ బీజేపీ అనే సరికొత్త నినాదంతో ఎన్నికల బరిలో తమ సత్తా ఎంతో తేల్చుకునేందుకు రాష్ట్ర నాయకత్వం ఆపసోపాలు పడుతోంది. అంతేగాక హిందూత్వ ఎజెండాను ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో వాడు కుంటోంది. దీనిప్రభావం ఉత్తర తెలంగాణ ఫలితాలపై ఎక్కువగానే చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యాభై శాతానికి పైగా స్థానాలే లక్ష్యంగా..
ఏడుకార్పొరేషన్‌లు, 116 మున్సిపాలిటీల్లో 2996 వార్డుల్లో యాభై శాతానికిపైగా స్థానాలను టార్గెట్‌గా పెట్టుకుని బీజేపీ బరిలోకి దిగింది. ఆ దిశగా ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు, ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలను అప్పగించింది. గతం లో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికలను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఎన్నికల ఫలితాలే తర్వాత జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఫలితాలపై పడతాయి. అందుకే వీలైనంత ఎక్కువ స్థానాలను గెలవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇందుకు ప్రధాన ప్రచార అస్త్రాలను పదునుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది.
ఆరు గ్యారెంటీలు.. జాబ్ క్యాలెండర్‌పై ఫోకస్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హ్యా మీలతోపాటు వీటిలో ఇప్పటి వరకు ఎన్ని గ్యారెంటీలు, హామీలు అమలు చేసింది? ఇం కెప్పుడు చేస్తారో నిలదీసే ప్రయత్నం చేస్తోం ది. ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు తదితర అంశాలపై మాట్లాడుతూ ఓటర్లను ఆలోచింపచేస్తోంది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం నడిచేదే కేంద్ర ప్రభుత్వ నిధులపైన అని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది.
రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఇచ్చిందో ప్రజలకు అర్థమయ్యేలా ఆ పార్టీ నేతలు వివరిస్తున్నారు. దీనికోసం తమ పార్టీ కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు, సీఎంలను రాష్ట్రానికి తీసుకొచ్చి వారితో చెప్పిస్తున్నారు. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన ప్రాజెక్టులు, నిధులు, గ్రామ పంచాయితీలకు విడుదల చేసిన నిధు లు, జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, స్పీడ్ రైళ్లు, స్మార్ట్ సిటీస్, అమృ త్ తదితర పథకాల కింద ఇచ్చే నిధులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది.
కాళేశ్వరం , ఫోన్ ట్యాపింగ్‌పై విమర్శలు
రాజకీయ ఆరోపణలను కూడా బీజేపీ నాయకులు ఎక్కుపెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ కేసులను విమర్శలు గుప్పిస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటున్న సీఎం రేవంత్ రెడ్డి మరీ కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడంలేదో చెప్పాలని నిలదీస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు చర్యలు తీసుకోవడంలేదు? అనే చర్చను ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంలోనూ బీఆర్‌ఎస్ నేతలను కాంగ్రెస్ కాపాడుతుందని విమర్శలను బీజేపీ నేతలు జనంలోకి తీసుకెళ్తున్నారు. ఓటర్లను ఆలోచింప జేసేలా బీజేపీ నాయకుల విమర్శలుంటున్నాయి.