1 September, 2026 | 2:28 AM

వేట ప్రారంభం

01-09-2026 01:28 AM

ఎస్‌ఆర్డీ ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేట’. ఇందులో సందీప్ సరోజ్, సాత్విక జంపా జంటగా నటిస్తున్నారు. దర్శకుడు అశోక్ కోటిపల్లి (Director Ashok Kotipalli) తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఫణి అడపాక, జయలక్ష్మీఅడపాక నిర్మాతలు. కేఎస్ రవికుమార్, రాజీవ్ కనకాల, రఘుబాబు, రవీంద్ర విజయ్, ప్రభావతీ, ప్రమోదీని, వికాస్ వశిష్ట కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రం సోమవారం సంప్రదాయ పూజలతో ప్రారంభం కాగా, పలువురు సినీప్రముఖులు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు.

ముహూర్తపు సన్నివేశానికి కొణిదెల నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా.. కేఎస్ రవికుమార్ క్లాప్ కొట్టారు. సాయిరాజేశ్, ఎస్కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మెహర్ రమేశ్, యదు వంశీ, అనుదీప్ దేవ్ పాల్గొన్నారు. అనంతరం ప్రెస్‌మీట్‌లో హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ.. “కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో అందరికీ పరిచయం అయ్యాను. ‘వేట’ చిరంజీవి టైటిల్. మా కథకు సరిగ్గా సరిపోతుందనే ఈ పేరు పెట్టాం. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా” అన్నారు.

కథానాయకి సాత్విక జంపా మాట్లాడుతూ.. “వేట’ నా కెరీర్‌లో గొప్ప ప్రారంభంగా మారుతుందని ఆశిస్తున్నా” అని చెప్పింది. ‘ఇదే నా మొదటి సినిమా. ఈ సినిమాతో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్’ అని దర్శకుడు అశోక్ తెలిపారు.

నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ.. “కమిటీకుర్రోళ్లు’లానే ఇదీ ఓ గ్రామీణ కథ. సినిమా ఎంతో సహజంగా ఉంటూనే కమర్షియల్ పంథాలో ఉంటుంది” అని చెప్పారు. ఈ చిత్రానికి డీవోపీ: వాజిద్ బేగ్; సంగీతం: చైతన్ భరద్వా జ; లిరిక్స్: శ్రీ హర్ష ఏమని, సురేశ్ బనిశెట్టి, పూర్ణ చారి; ఫైట్స్: ఏ విజయ్; ఎడిటర్: రాఘవేంద్ర తిరుణ్; ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే.