నిరుద్యోగ యువత ఆశలు..
కార్మిక సంఘాలకు వరం
జిల్లాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసాలకు శ్రీకారం?
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 23, (విజయక్రాంతి): నిరుద్యోగ యువత ఆశలు కార్మిక సంఘాలకు వరంగా మారాయి. వారి ఆశలను ఆసరా చేసుకొని ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సమస్త (టీఎస్ జెన్కో) లో ఆర్టిజన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పుకుంటూ పాల్వంచకు చెందిన ఓ ప్రముఖ కార్మిక సంఘం నాయకులు పెద్ద ఎత్తున వసూళ్ల దందా చేపట్టినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. డబ్బులు చెల్లించిన విషయాలను బయట పెట్టకూడదని కట్టుదిట్టమైన ఆంక్షలు పెట్టి గోప్యంగా వ్యవహారం కొనసాగిస్తున్నారని విశ్వాసనీయంగా తెలుస్తోంది.
ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న అమాయక నిరుద్యోగులను నమ్మబలుకుతూ ఈ దందాకు తరలిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, సంబంధిత శాఖ అధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగ యువకులను మోసం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. విశ్వాసనీయ సమాచారం మేరకు ఉద్యోగాల కోసం ప్రభుత్వంలోని రాజకీయ నాయకులతో రూ కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పుకుంటూ, ఆశావాహులను నమ్మబలుతున్నట్టు తెలుస్తోంది. ఒక్కో ఆశావాహుడి నుంచి రో నాలుగు నుంచి ఐదు లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
వాటిల్లో ముందస్తుగా ఒక లక్ష రూపాయలు తక్షణమే చెల్లించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సుమారు 20 మంది వరకు నిరుద్యోగులు ఒక్కొక్కరు లక్ష రూపాయలు ఏం దందాకు ముట్ట చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే మీకు ఉద్యోగం రాదని ఇప్పుడు ఇచ్చిన డబ్బులు తిరిగి మీకు చెల్లించబోవని వారిని భయపెడుతున్నట్లు తెలుస్తోంది. జెన్కో ఉన్నతాధికారులు ఉద్యోగాల దందాపై దృష్టి సారించాలని, నిరుద్యోగ యువత మోసపోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రూ 5లక్షల వసూలు
ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని, అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి, ఓ నిరుద్యోగ యువకుడి నుంచి రూ 5 లక్షలువసూలు చేసినట్లు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు సోమవారం ఫిర్యాదు అందింది. దీన్ని బట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగ యువత ఆశలను దళారులు దండిగా వసూలు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది.




