ఫీజుల రద్దును ప్రభుత్వం విరమించుకోవాలి
- ఫీజుల పథకానికి అడ్డుపడితే సీఎం రేవంత్‌కు బుద్ధి చెప్తాం
- బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అర్ కృష్ణయ్య
ముషీరాబాద్, మే 3 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమిం చుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రాన్ని అగ్ని గుండంలా మారుస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ అర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో 20 విద్యార్థి సం ఘాల సమావేశం బీసీ ఐక్య కులాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్య అధ్యక్షతన జరిగింది.
ముఖ్య అతిధిగా అర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ 18 ఏళ్ల క్రితం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో తాను ఐదు రోజులు నిరాహార దీక్ష చేపట్టి తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారిస్తే ఊరుకునేది లేదన్నారు. వైఎస్‌ఆర్ అనంతరం ఫీజు రియంబర్స్‌మెంట్‌కి అడ్డుపడిన ఆనాటి ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను తెలంగాణ ప్రజలు గద్దె దించారని, ఫీజుల పథకానికి అడ్డుపడితే సీఎం రేవంత్ రెడ్డికి కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు.
ఆ తరువాత వచ్చిన కెసిఆర్ కూడా పదేళ్లు ఫీజుల స్కీమ్ ను అద్భుతంగా కొనసాగించారని, తాను దిగిపోయే ముందు కూడా ఫీజు ల బకాయిలు చెల్లించాడని గుర్తు చేశారు. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫీజుల పథకంపై ఆధారపడ్డ 14 లక్షల మంది విద్యార్థులు చదువుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు. కెసిఆర్ హయాంలోని కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు కమీషన్ల కోసమే రేవంత్ రెడ్డి చెల్లించి, విద్యార్థులకు అన్యాయం చేశాడని ఆరోపించారు.
సీఎం పీఠాన్ని డబ్బుతో నిర్మించుకుని, రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న కాంగ్రెస్ నేతలపై ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాం గ్రెస్ నేతలు తిన్న ప్రజల సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నేత లు సీ.రాజేందర్, గొరిగే మల్లేష్, సదానం దం, శివ కుమార్ గౌడ్, పృథ్వి, చంద్రశేఖర్, రాకేష్, సుమిత్ తదితరులు పాల్గొన్నారు.






