4 July, 2026 | 1:02 AM

పన్నులే ప్రామాణికం కావొద్దు

04-07-2026 12:11 AM
  1. వెనుకబడిన జీపీలకు వెసులుబాటు కల్పించాలి
  2. అన్‌టైడ్ గ్రాంట్లను కొనసాగించండి
  3. కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి) : గ్రామ పంచాయతీల పనితీరును కేవలం పన్నుల వసూళ్లతోనే అంచనా వేయకుండా, ప్రజలకు అందిస్తున్న సేవలు, పారిశుధ్యం, పారదర్శకత, డిజిటల్ పాలన, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. 16వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన పనితీరు ఆధారిత గ్రాంట్లు, ఓన్ సోర్స్ రెవెన్యూ వంటి నిబంధనల్లో ఆదివాసీ, గిరిజన, షెడ్యూల్ ప్రాంతాలు, వెనుకబడిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కోరారు.

16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల సిఫార్సులపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్‌లో మంత్రి సీతక్క తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయా లను వివరించారు. 

ఈ  జీపీలకు పనితీరు ఆధారిత గ్రాంట్లను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని, అయితే ఆదాయ సామర్థ్యం తక్కువగా ఉన్న ఆదివాసీ, గిరిజన, మారుమూల ప్రాంతాల గ్రామ పంచాయతీలపై అదనపు పన్నుల భారం మోపే విధంగా నిబంధనలు ఉండకూడదన్నారు.

అభివృద్ధిని ప్రజల ఆర్థిక స్థితితో ముడిపెట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా ఎన్నికలు జరగని 62 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులు నిలిపివేయడం వల్ల అక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతుంద న్నారు.

స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్ణయాలు తీసుకునేలా అన్‌టైడ్ బేసిక్ గ్రాంట్లను కొనసాగించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. డిజిటల్ గవర్నెన్స్, ఈ స్వరాజ్, పీఎఫ్‌ఎంఎస్ వంటి వ్యవస్థలను బలోపేతం చేయాలని కోరారు.