ఆలయ అభివృద్ధి.. కోనేరు పునరుద్ధరణే లక్ష్యం
శంభు లింగేశ్వర సేవా సమితి ట్రస్ట్ నూతన పాలక మండలి ఎన్నిక
కొండపాక, ఆగస్టు 16: దుద్దెడలోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర సేవా సమితి ట్రస్ట్ నూతన పాలక మండలి నూతన పాలక మండలిని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మంచాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా గోనె శ్రీనివాస్, నర్ర దేశాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అనంతుల నరేందర్, కోశాధికారిగా పెద్ది కుమారస్వామి సహాయ కార్యదర్శులుగా మంచాల చిన్న శ్రీనివాస్, బూర్గుల వెంకటరమణ, సలహాదారులుగా మంచాల కృష్ణమూర్తి, అమీరిశెట్టి వెంకటేశంలు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు మంచాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ సమగ్ర అభివృద్ధికి పాలక మండలి సభ్యులందరి సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని పవిత్ర కోనేరు పునరుద్ధరణ పనుల్లో మిగిలిన అసంపూర్తి పనులను హనుమదీక్ష సేవా సమితి సభ్యులతో సమన్వయం చేసుకొని త్వరితగతిన పూర్తి చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.
భక్తుల సౌకర్యార్థం మరిన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు నిత్య పూజా, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే తమ పాలక మండలి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వడ్లకొండ శ్రీనివాస్, ఆరేపల్లి మహదేవ్, కోట శ్రీనివాస శర్మ, పబ్బోజు శ్రీనివాస్, పబ్బోజు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.






