17 August, 2026 | 1:06 AM

ముగిసిన రైతుబీమా పథకం గడువు

17-08-2026 12:03 AM
  1. ఈ ఏడాది కొనసాగింపు ఉన్నట్టా..? లేనట్టా...? 
  2. ప్రారంభించని ఇందిరమ్మ బీమా
  3. 3,065 మంది రైతు కుటుంబాలకు రూ. 1532.50 కోట్ల పరిహారం...
  4. అయోమయంలో రైతులు...

మంచిర్యాల, ఆగస్టు 16 (విజయక్రాంతి) : ఏదైనా ప్రమాదం జరిగి రైతు మృతి చెందినా, సాధారణంగా మృతి చెందినా వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రితో ముగిసిపోయింది. ఈ బీమా కొనసాగుతుందా..! ఆగిపోతుందా..! అనేది ఇంత వరకు తెలియకపోవడంతో రైతులు ఒకంతు ఆందోళనకు గురవుతున్నారు.

ప్రతి ఏడాది ఆగస్టు 14వ తేదీన ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లిస్తేనే ఈ పథకం కొనసాగింది. ఈ ఏడాది ఇంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు, దీనితో ఈ పథకం ఆగినట్టే అయ్యింది. ఇక రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబానికి ఇచ్చే రూ. 5 లక్షల పరిహారం కూడా ఆగనుంది.

రైతులకు అండగా ఎనిమిదేండ్లుగా రైతుబీమా...

రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యంతోపాటు అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో ఇలా వివిధ కారణాలతో రైతులు అకాల మరణం పొందితే వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో రైతుబీమా పథకానికి శ్రీకారం చుట్టారు.

18-60 ఏండ్ల మధ్య వయస్సు కలిగి, వారి పేరిట ఎంతో కొంత భూమి కలిగిన రైతులను అర్హులుగా ఈ పథకానికిగా వర్తింపజేశారు. ఎల్‌ఐసీకి ప్రతి ఏడాది ప్రీమియం చెల్లిస్తూ ఈ పథకంలో నమోదైన రైతులు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా ఎనిమిదేండ్లుగా ఈ పథకం కొనసాగింది. 

3,065 మంది రైతు కుటుంబాలకు రూ. 1532.50 కోట్ల పరిహారం...

జిల్లాలో రైతుబీమా పథకం 2018-19 నుంచి 2025-26 వరకు వివిధ కారణాలతో 3,123 మంది రైతులు మరణించారు. వారిలో ఇప్పటి వరకు అన్ని రకాలుగా డాక్యుమెంట్లు అందజేసిన 3,065 మంది రైతులకు ఎల్‌ఐసీ సంస్థ రైతుబీమా పథకం కింద ఒక్కొక్క రైతు కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం కింద 1532.50 కోట్లు అందజేసింది. కాగా ఈ ఏడాది రైతుబీమా ప్రీమియం ఎల్‌ఐసీకి చెల్లించకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.

రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబాలకు ఈ పథకం ఎంతో అండగా ఉండేదని, ఇప్పుడు ఆ భరోసా లేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుబీమా పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఇందిరమ్మ కుటుంబ బీమా ప్రారంభిస్తామన్న ప్రభుత్వం దాని ఊసే మరచిందని, ఏదైనా ప్రమాదం జరిగితే రైతుబీమా పథకం కింద అందే రూ. 5 లక్షల పరిహారం అందదనే ఆందోళనలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. రైతుబీమా రద్దుతో కుటుంబాలకు భరోసా లేనట్టేనని, మళ్లీ కష్టాలు మొదలుకానున్నాయని ఆవేదన చెందుతున్నారు.