17 August, 2026 | 3:05 AM

శాంతిఖనిలో నోటీసుల కలకలం..!

17-08-2026 12:00 AM
  1. ఉద్యోగ భద్రతపై ఆందోళన
  2. ‘అశాంతి’ఖనిగా మార్చేశారు..
  3. పక్షం రోజుల్లో 70 నోటీసులు.. కలవరపడుతున్న కార్మికులు
  4. బెదిరింపుల పనివిధానం.. ఇష్టారాజ్యంగా అధికారులు
  5. చతికిలపడిన సంఘాలు

బెల్లంపల్లి, ఆగస్టు 16 : అది పేరుకే శాంతిఖని.., అక్కడ రాజ్యమేలేది అరాచకం.., అశాంతి అని... కార్మికులపై వేధింపులు అవుననే చెబుతున్నాయి... కొందరు ఆధికారులు శాంతిఖని గనిని అశాంతిగా మార్చివేశారన్న ఆరోపణలు కార్మికుల్లో సర్వత్రా వినిపిస్తున్నాయి. అనునిత్యం అధికారుల వేధింపులతో కార్మికులు తల్లడిల్లుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల వేధింపులు దినం దినం పేట్రేగిపోతున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని సైతం వదిలిపెట్టకుండా వేధిస్తున్నారని వాపోతున్నారు.

వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అధికారుల తీరుపై  ఆగ్రహావేషాలు వ్యక్తమవుతున్నాయి. డ్యూటీకి వెళ్తే ఒక బాధ, వెళ్ళకపోతే నోటీసుల బాధ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... బెదిరింపు నోటీసులు కార్మికులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. బెదిరింపులు, వేధింపులు అక్కడ నిత్యం సర్వసాధారణ మయ్యాయి. వేధింపులపై మాట్లాడే వారే కరవయ్యారు. గనిపై యూనియన్ల లీడర్లు ఉన్నారా..? అన్న సందేహం కలుగుతుంది.

శాంతిఖనిలో ట్రేడ్ యూనియన్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని కార్మికులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. అన్యాయాలను ప్రశ్నించడమే మర్చిపోయారని తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. కార్మికులపై సకల దాష్టికాలని కళ్ళారా చూస్తున్నారనీ, కానీ వాటిపై స్పందించడం లేదనే విమర్శలు అందుకు బలం చేకూర్చుతున్నాయి. 

చతికిలపడిన సంఘాలు..

అధికారులను ఎదిరించే దమ్ము, ధైర్యం లీడర్లలో క్షీణించిపోయిందనే అభిప్రాయాలు పెల్లుబికుతున్నాయి. ఇలాంటి పరిస్థితి సింగరేణిలో మరెక్కడా లేదని కార్మికులు వాపోతున్నారు. శాంతిఖనిలో పక్షం రోజుల్లోనే  కార్మికులకు 70కి పైగా నోటీసులిచ్చారు. ఏదైనా కారణంతో కార్మికుడు విధులకు రాకపోతే వెంటనే నోటీసులిస్తున్నారు. ఒక రోజు విధులకు రాకపోతే విధులకి వచ్చిన మరుసటి రోజు ఆ కార్మికుడికి  డ్యూటీకి ఎందుకు రాలేదోననే సమాధానం చెప్పాలని నోటీసులిస్తున్నారు.

ఒక్కరోజు గైర్హాజరును తప్పు పట్టి నోటిసులిచ్చిన చరిత్ర సింగరేణిలో ఇంతవరకూ ఎక్కడా లేదు. ఒక్క రోజు డ్యూటీకి రాకపోవడం అస్సలు తప్పుకానేకాదు... పైగా అందుకు నోటీసులివ్వడం, సంజాయిషీ అడగాలని కార్మిక చట్టాల్లో ఎక్కడా లేదు. నోటీసుల జారీ వెనుక కార్మికులను అవమానించడమే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుల ఆత్మ గౌరవాన్ని  దెబ్బతీస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.

నోటీసుల పేరిట కౌన్సిలింగ్ ఇచ్చి కార్మికులను అభద్రతకు గురిచేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. కార్మికులను భయం గుప్పిట్లో పెట్టేందుకే ఈ నోటిసులను  అస్త్రంగా ప్రయోగిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నోటీసుల విధానం  కార్మికులను డిస్మిస్ చేసే వరకు వెళుతుందనే భయం పట్టుకుంది. ఆదిలోనే ఈ చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో కార్మికుల ఉద్యోగాలు దక్కడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గనిలో పుట్టెడు సమస్యల మధ్య కార్మికులు ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి ఉత్పత్తి కోసం శ్రమిస్తున్నారు. కనీస సదుపాయాలు కల్పించని వైనంలో గని అధికారులున్నారు. అందుకు అధికారులకు ఏనాడైనా నోటీసులు ఇచ్చారా..? గనుల్లో ప్రాణాలు బలితీసుకున్న అధికారులపై చర్యలు ఎప్పుడైనా  తీసుకున్నారా..? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. అధికారుల తప్పుల్ని మరొకరిపై నెట్టి తప్పు చేసిన అధికారుల్ని కాపాడిన చరిత్రను ఇది వరకు చూశాం.

అదే కొనసాగుతుంది. ఏనాడు అధికారులపై చర్యల దాఖలాలు లేవు. సింగరేణిలో  మొదటి నుంచి అధికారులకో న్యాయం, కార్మికులకో న్యాయం అనే ద్వంద్వ వైఖరి మరోసారి నిరూపితం అయ్యింది. సింగరేణిలో అధికారుల యధాతథ చరిత్ర తెలిసిందే. కాగా ఒక్క రోజు గైర్హాజరు లేమి పని గంటలు అమలు కోసం సరికొత్త రూల్స్ ను తెరపైకి తెచ్చారు. కార్మికుల అణిచివేత కోసం ఎక్కడాలేని పద్ధతులను శాంతిఖనిలో అమలు చేస్తున్న అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

బెదిరింపులతో ఉత్పత్తి వస్తుందా..?

ఉద్దేశపూర్వకంగా కార్మికులు ఎప్పుడు డ్యూటీలకు ఎగ్గొట్టరు. డ్యూటీ చేస్తేనే కదా కుటుంబం గడుస్తుంది. డ్యూటీలు చేయమని అధికారులు ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. పైగా బెదిరింపులు వారి బాధ్యత అసలు కాదు. బెదిరింపులతో బొగ్గు ఉత్పత్తి రాదు. ఇలాంటి చర్యలు పారిశ్రామిక సంబంధాలను మరింతగా దెబ్బతీస్తాయి. ఇప్పడు శాంతిఖనిలో అధికారులు చేస్తున్నదదే అని కార్మికులు అంటున్నారు.

ఒక్క రోజు గైర్హాజకు నోటీసులు ఇచ్చి కార్మికులను ఆగమాగం చేయడం తప్పమరేమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సింగరేణి ప్రగతి కోసం కార్మికులు అనునిత్యం తమ రక్తాన్ని చమటగా మారుస్తున్నారు. కష్టకాలంలో సింగరేణి సంస్థను కాపాడుకున్న చరిత్ర కార్మికులది. ఆ సత్యాన్ని కొందరు అహంకారపు అధికారులకు అర్దం కాదని సింగరేణి శ్రేయోభిలాషులు తీవ్రంగా మండిపడుతున్నారు.

సింగరేణి మనుగడ కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నది ఎవరనేది సింగరేణి కార్పొరేట్ యాజమాన్యం గుర్తించాలి. ఏరియా స్థాయి అధికారులు పర్యవేక్షణ సమర్థతను కోల్పోయి ఇలా కార్మికులను బెదిరింపులతో పనిచేపించాలనుకోవడం అవివేకమని పలువురు అంటున్నారు. ఇలాంటి దుందుడుకు అధికారులపై సింగరేణి యాజమాన్యం ప్రధానంగా దృష్టి సారించాలని కార్మికులు కోరుతున్నారు.

అలా వదిలేస్తే సింగరేణి పురోగతికి స్థానిక అధికారుల విధానాలే ప్రతిబంధకంగా మారె ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయాలు కాదనలేనివి. అక్రమ నోటీసుల విధానాన్ని వెంటనే ఆపాలని కార్మికుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. అధికారుల తీరు శాంతిఖనిపై ప్రతికూల ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. గని నడిపించే తీరు ఇది కాదని నిపుణులు అంటున్నారు.