గుంతలతో ఇబ్బందులు
- నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనులు
- రోడ్డు నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు..
తాడ్వాయి, ఆగస్టు 16 (విజయ క్రాంతి): అడుగడుగున గుంతలు...అధ్వానంగా రోడ్డు.. రోడ్డుపై వెళ్లాలంటేనే నరకప్రాయం... ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని నాయకులను కోరితే ప్రభుత్వం రూ.25 లక్షల నిధులు మంజూరు చేసింది.కానీ నిధులు మంజూరయ్యాయన్న సంతోషమే కానీ ఇప్పటికీ రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. అదే కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడుపల్లి, జువ్వాడి రోడ్డు. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఏడాది క్రితమే మంజూరు చేసింది.
ఇప్పటికి ఏడాది పూర్తయిన రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని దేమికలాన్,కరడ్ పల్లి గ్రామాల ప్రజలు గాంధారి మండల కేంద్రానికి వెళ్లాలంటే ఈ రోడ్డు మీదుగానే వెళుతుంటారు. ఈ రోడ్డు మార్గం కాకుండా వయా జనగామ,లింగంపల్లి గ్రామాల మీదుగా గాంధారి వెళ్లాలంటే 10 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది.
అందుకోసమే ప్రజలు జువ్వాడి మీదుగా గాంధారి వెళ్ళడానికి ఈ రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటారు కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు మరమ్మతు పనులు ఇప్పటికి జరగకపోవడంతో కరడుపల్లి, కన్కల్, దేమికలాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాడ్వాయి మండలంలోని ప్రజలు గాంధారి,బాన్సువాడ ఈ రోడ్డు మీదుగానే వెళుతుంటారు. ఒక్క తాడ్వాయి మండలంలోని ప్రజలకే కాకుండా గాంధారి మండల ప్రజలకు సైతం ఈ రోడ్డు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గాంధారి మండల ప్రజలు కామారెడ్డి పట్టణానికి దూర భారం తగ్గించుకోవడం కోసం ఈ రోడ్డును వినియోగిస్తుంటారు.
మరమ్మతులు ప్రారంభించండి..
జువ్వాడి రోడ్డుకు వెంటనే మరమ్మతులు ప్రారంభించాలని కరడ్పల్లి, కన్కల్ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.స్థానిక ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు నిధులు మంజూరు చేయించిన ఇప్పటికీ పనులు ప్రారంభ కాకపోవడం పై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
అడుగడుగున గుంతలు...
ఈ రోడ్డులో అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో కరడ్పల్లి రోడ్డు నుంచి జువాడి గ్రామం వరకు ప్రయాణం నరకప్రాయంగా మారింది.ఈ రోడ్డుమీద ప్రయాణం చేస్తూ ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రమాద బారిన పడ్డట్లు స్థానికులు తెలిపారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.






