మెడికల్‌షాపులో ఇష్టారాజ్యం!
- మెడికల్ మాఫియాకు అడ్డుకట్టేదెప్పుడు?
- నర్సాపూర్లో మెడికల్ షాపులపై నిఘా కరువు
- జనరిక్ మందులకు బ్రాండెడ్ ధరలు
- ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయాలు
- ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలు నామమాత్రమే
- కమీషన్ల దందాపై ఆరోపణలు
నర్సాపూర్, ఆగస్టు 16: నర్సాపూర్ నియోజకవర్గంలోని కొన్ని మెడికల్ షాపుల్లో మందుల విక్రయాల్లో నిబంధనలు గాలికొదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనరిక్ మందులను బ్రాండెడ్ ఔషధాల పేరుతో అధిక ధరలకు విక్రయిస్తూ రోగుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొన్ని మెడికల్ షాపుల్లో మందులు అందిస్తున్న పరిస్థితి నెలకొంది.
ధరల్లో భారీ తేడా..
జనరిక్, బ్రాండెడ్ మందుల ధరల్లో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ వినియోగదారులకు సరైన అవగాహన కల్పించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.ఉదాహరణకు.. పాంటోప్రాజోల్ బ్రాండెడ్ మందులు పది మాత్రలకు సుమారు రూ.100 నుండి 150 ఉండగా, జనరిక్ రూపంలో అదే మందులు రూ.11 నుండి 20లకే లభిస్తున్నట్లు సమాచారం. ఇదే విధంగా కొన్ని సిరప్లు, ట్యాబ్లెట్లు, ప్రొటీన్ ఉత్పత్తుల్లోనూ ధరల్లో గణనీయమైన తేడా ఉంటోంది.
చీటీ లేకుండానే మందులు.. ప్రిస్క్రిప్షన్ కు పాతర
జ్వరం, జలుబు వంటి సాధారణ సమస్యలకే కాకుండా వివిధ అనారోగ్యాలకు వైద్యుడిని సంప్రదించకుండా మెడికల్ షాపులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు మెడికల్ షాప్ నిర్వాహకులు డాక్టర్ల లాగా సల హాలు ఇస్తూ మందులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన బిల్లులు, మందుల వివరాలు కూడా అన్ని దుకాణాల్లో సక్రమంగా అంద డం లేదనివినియోగదారులు చెబుతున్నారు.
మెడికల్ షాపులపై నిఘా ఎక్కడ?
మెడికల్ షాపులు, హోల్సేల్ ఏజెన్సీలపై ఔషధ నియంత్రణ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా పర్యవేక్షణ నామమాత్రంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న దుకాణాలపై చర్యలు లేకపోవడం అక్రమాలకు ఊతమిస్తోందని ప్రజలు అంటున్నారు. మెడికల్ షాపుల సంఘాల ప్రభావంతో అధికారులు తనిఖీలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలపైనా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
కమీషన్ల కోసం మందులా?
కొన్ని ఔషధ కంపెనీలు తమ ఉత్పత్తుల విక్రయాల కోసం వైద్యులకు కమీషన్లు, టార్గెట్లుఇస్తున్నాయనేఆరోపణలు ఉన్నాయి. దీంతో రోగుల అవసరాల కంటే కంపెనీల విక్రయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో జనరిక్ మందులు అందుబాటులో లేక పేదలు అధిక ధరలకు మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ఔషధ విక్రయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, మెడికల్ షాపుల తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.






