17 August, 2026 | 3:37 AM

పదేళ్లు ఏం చేశారు?

17-08-2026 01:37 AM
  1. మంచి స్కూళ్లు, కాలేజీలు ఎందుకు పెట్టలేదు?
  2. టీచర్లు, అధ్యాపక పోస్టులను భర్తీ చేయలేదు 
  3. ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): ‘పదేళ్లు అధికారంలో ఉన్న ప్పుడు ఏం చేశారు? మంచి స్కూళ్లు, కాలేజీలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఉపాధ్యాయులు, అధ్యాపక పోస్టు లను ఎందుకు భర్తీ చేయలేదు? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఆదివారం ‘ఎక్స్’వేదికగా కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అధికారం కోల్పోయిన తర్వాత దేశంలో మంచి కాలేజీలు లేవని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

‘సోర్ గ్రేప్స్’ కథను ప్రస్తావిస్తూ.. ‘ఒక నక్క ద్రాక్షపండ్లను అందుకోవడానికి చాలా సార్లు ప్రయత్నించి విఫలమైంది.. చివరకు అవి పుల్లగా ఉంటాయని చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఏదైనా సాధ్యం కాకపోతే దానినే తక్కువ చేసి మాట్లాడటం కేటీఆర్‌కు వెన్నతో పెట్టి విద్య’ అని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీ, పేపర్ లీకులు, కాలేజీలకు నిధుల విడుదల, ఫీజు రీయింబర్సమెంట్ బకాయిలపైనా బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న యూనివర్సిటీ విద్యార్థులకు కనీస గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు.

అప్పుడు మనువడు, ఇప్పుడు మనవరాలు

‘బీఆర్‌ఎస్ పాలనకు ఇప్పుడు కేసీఆర్ కుటుంబం నుంచే రిపోర్ట్ కార్డు వస్తోంది. మొదట ఆయన మనవడే పాఠశాలలు బాగోలేవని చెప్పాడు. ఇప్పుడు ఆయన మనవరాలు కాలేజీలు కూడా బాగోలేవని అంటుంది. పదేళ్లు అధికారంలో ఉండి, మీరు పరిష్కరించలేకపోయిన సమస్యలను మీ సొంత పిల్లలే ఇప్పుడు ఎత్తిచూపుతున్నారు. మీ రాజకీయ ప్రత్యర్థుల పిల్లలు కాలేజీల్లో ఏం చేస్తున్నారో గమనించడం, మా ఫోన్లను ట్యాప్ చేయడంపై దృష్టి పెట్టే బదులు, మీ సొంత పిల్లలు చెబుతున్న విషయాలను మీరు వినాలి’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

లంక గొప్పదని చెప్పేది రావణాసురుడే..

‘భారత్ కంటే శ్రీలంక గొప్పదని చెప్పడం సరైంది కాదు. లంకను చూసి భారత్ కంటే గొప్పదని చెప్పేది రావణాసురుడే. రామభక్తులు ఎప్పటికీ తమ మాతృభూమి గురించి అవమానకరంగా మాట్లాడరు. భారత్‌లో అధికారాన్ని కోరుకుంటారు. ఇక్కడి ప్రజాధనంపై నియంత్రణ కావాలని కోరుకుంటారు. కానీ దేశాన్ని ప్రశంసించే విషయానికి వచ్చేసరికి, ఇతర దేశాలు గొప్పగా కనిపిస్తాయి. దుస్తులు, రూపాలు మార్చుకున్నా..  భారత్ పట్ల ఉన్న అవమాన భావనలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు’ అని మండిపడ్డారు.

నాకు నేషనే ఫస్ట్

నాకు ఎల్లప్పుడూ ‘నేషనే ఫస్ట్’ (దేశమే ప్రథమం) అని, తన దేశభక్తిని ఎవరూ ప్రశ్నించలేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వందేమాతరంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. మరో వైపు మన ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అని అవమానించేలా వ్యాఖ్యలు చేస్తోంది. మరోవైపు భారత్‌లో మంచి కాలేజీలు లేవని, ఇతర దేశాలు భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయని  బీఆర్‌ఎస్ చెబుతోంది. ఇలాంటి వారు నా దేశ భక్తిని ప్రశ్నిస్తున్నారు. నా చివరి శ్వాస వరకు కాషాయ జెండాను, త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ధరిస్తాను.

ఈ దేశం నా చెమటను చూసింది. భారత్‌కు ఎప్పుడైనా అవసరమైతే నా రక్తాన్ని ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నా. మీరు నన్ను వెయ్యి సార్లు ప్రశ్నించినా, భారత్ మాతా కీ జై అంటూ జీవితాన్ని గడిపిన ఒక కార్యకర్తకు భారత్ అంటే ఏమిటో అర్థమవుతుంది.  మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. మీకు దేశభక్తి ఒక చర్చ అంశం కావచ్చు. కానీ నాకు అది జీవితాంతం నమ్మిన సిద్ధాంతం’ అని పేర్కొన్నారు.