9 August, 2026 | 1:24 AM

మోదీని బయట పెట్టిన జెన్ జీ

09-08-2026 12:00 AM
  1. దేశ అభివృద్ధి కోసం యువత రాజకీయాల్లోకి రావాలి
  2. సెప్టెంబర్ 17 నుంచి పాదయాత్ర చేస్తా
  3. టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శనివారం హనుమకొండ జిల్లా అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన ‘యూత్ మీటప్ విత్ తీన్మార్ మల్లన్న‘ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, జెన్ జీ యువతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని మోదీని జెన్ జీ బయపెట్టిందని, రాజకీయాల్లో మార్పు కేవలం జెన్-జీ యువతతోనే సాధ్యమని, సాంకేతికతను ఆయుధంగా మలచుకొని వ్యవస్థను ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చారు.

కేవలం ఐదు సెకన్లలో సమాచారాన్ని సృష్టించగల ఈ తరం, రాజకీయాల్లో కూడా అంతే వేగంగా మార్పు తీసుకురావాలని ఆకాంక్షించారు. తమిళనాడు రాజకీయాలను ఉదాహరణగా చూపిస్తూ, అక్కడ నటుడు విజయ్ పార్టీ కోసం జెన్-జీ యువత కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేసి అద్భుతాలు సృష్టించారని మల్లన్న వివరించారు. అదే చైతన్యం తెలంగాణలో రావాలని ఆయన కోరారు. ఓటు వేయడమే కాకుండా వేసిన ఓటును వాపస్ తీసుకునే హక్కు ప్రజలకు ఉండటమే ’రైట్ టు రీకాల్’.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే, పని చేయని ఎమ్మెల్యేలను ఐదేళ్ల పదవీ కాలం ముగియకముందే తొలగించే విధంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని మల్లన్న హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మెజారిటీ వర్గాలైన బీసీ పిల్లలకు నాణ్యమైన విద్య  అందాలంటే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవసరమని మల్లన్న పేర్కొన్నారు. యువత అడిగిన పలు క్లిష్టమైన ప్రశ్నలకు మల్లన్న తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.

కేజీ నుంచి పీజీ వరకు రూపాయి ఖర్చు లేని కార్పొరేట్ స్థాయి విద్యను, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. తన పోరాటాన్ని ఉధృతం చేస్తూ సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర  చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. కాగా కాజీపేట జంక్షన్, హనుమకొండ సుధానగర్, రంగశాయిపేట, కాశీబుగ్గ ప్రాంతాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్ యాదవ్‌తో కలిసి తీన్మార్ మల్లన్న పార్టీ జెండాలను ఆవిష్కరించారు. వడ్డేపల్లిలో మైనారిటీలతో ముచ్చటించారు.

ఈ కార్యక్రమాల్లో పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నరసయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకటేష్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు సంపత్ పటేల్, కాజీపేట అధ్యక్షుడు మల్లికార్జున్ శాస్త్రి పాల్గొన్నారు. కాగా హనుమకొండలోని ఓ హోటల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నాయకులతో తీన్మార్ కీలక సమావేశం నిర్వహించారు. 12 నియోజకవర్గాల్లో టీఆర్పీ జెండా ఎగరాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ మావోయిస్ట్ కిషన్‌తో పాటు పలువురు యువకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.