9 August, 2026 | 2:29 AM

అడవే అమ్మ.. దైవం!

09-08-2026 12:00 AM

ఉట్నూర్ (విజయక్రాంతి): అడవిని అమ్మలా చూసి, దైవంలా ఆదరిస్తారు ఆదివాసీ గిరిజనులు. అందుకే వీరిని అడవి బిడ్డలుగా పేర్కొంటారు. అమాయకత్వమే ప్రాణంగా విరాజిల్లుతున్న నిస్వార్థ జీవి ఆదివాసీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీల జీవితాలలో గతంలో కొంతమేర అభివృద్ధి వెలుగులు వచ్చినా చీకట్లు తొలగలేదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఐటీడీఏ పాలకవర్గ మండల సమావేశాలను నిర్వహించాల్సి ఉండగా ఆరు సంవత్సరాలుగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు నిర్వహించడం లేదు.

గిరిజన అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులతోపాటు గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే సంక్షేమ పథకాలపై ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో సభ్యులు  ఏకగ్రీవంగా తీర్మానం చేసి అమలు చేసే అధికారం పాలకమండలి సమావేశానికి ఉంది. కానీ పాలకులు మాత్రం ఐటీడీఏ పాలకవర్గ సమావేశంపై ఎలాంటి శ్రద్ధ చూపడం లేదు.

పాలకమండలి నిర్వహణపై పట్టింపేదీ? 

గిరిజనుల సంక్షేమం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశాన్ని నిబంధనల ప్రకారం నిర్వహించాలి. కానీ 2019 ఆగస్టు 30న ఆఖరు పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించడం లేదు. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదిమ గిరిజనులు అయిన కొలం, తోటిలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లను ప్రత్యేకంగా మంజూరు చేసింది.

అడవి ప్రాంతంలో ఈ ఇంటి నిర్మాణాలు చేయవద్దని అడవి శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. అటవీ శాఖ అధికారులతో తన పోరాటాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కొనసాగిస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాలకవర్గాలు ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆదిమ గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై చర్చించి గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాలని గిరిజనులు కోరుతున్నారు.