9 August, 2026 | 2:30 AM

సమతాదేవి నోట భగవద్గీత నాట్యం

09-08-2026 12:00 AM
  1. అనర్గళంగా 700 శ్లోకాల ప్రవచనం
  2. మైసూర్ దత్త పీఠం ద్వారా గోల్డ్ మెడల్

మహబూబాబాద్, విజయక్రాంతి: భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసి, అనర్గళంగా ప్రవచిస్తూ..ప్రతిభ చాటారు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన ఓలం సమతాదేవి. మైసూర్ దత్త పీఠం ద్వారా ఈ ఏడాది గోల్డ్ మెడల్ సాధించారు. దేశవ్యాప్తంగా వెయ్యి మందిలో ఒకరిగా నిలిచి, గీతాసారాంశాన్ని రోజూ విశ్వవ్యాప్తం చేస్తున్నారు. భగవద్గీత గ్రంథంలోని 18 అధ్యాయాలు.. 700 శ్లోకాలు.. ప్రతి శ్లోకంలోనూ జీవిత సత్యాలు. అలాంటి 700 శ్లోకాలను కంఠస్థం చేసి, వాటి భావాన్ని సైతం సులభంగా వివరించగలిగే ప్రతిభను సొంతం చేసుకున్నారు సమతాదేవి.

నిరంతర సాధన, ఏకాగ్రత, ఆధ్యాత్మిక చింతన, శ్రద్ధతో సమతాదేవి భగవద్గీతలోని ప్రతి శ్లోకాన్ని కంఠస్థం చేయడమే కాకుండా వాటిని సందర్భానుసారంగా స్పష్టంగా వివరిస్తున్నారు. ఉచ్ఛరణలోనూ, భావాన్ని అర్థం చేయడంలోనూ ఆమె ప్రత్యేకతగా నిలుస్తోంది. శ్లోకం ఏ సందర్భంలో వచ్చింది? శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆ మాట ఎందుకు చెప్పాడు? దాని ద్వారా మనిషికి అందే జీవన సందేశం ఏమిటి? వంటి అంశాలను వివరిస్తూ గీతా బోధన ను సామాన్యులకు చేరువ చేస్తున్నారు.

భగవద్గీతపై సమతాదేవి సాధించిన ప్రతిభకు విశిష్ట గుర్తింపు లభించింది. మైసూరు గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం ఆమె సాధనకు అరుదైన గౌరవంగా నిలిచింది. ఈ పురస్కారం తనకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందని, భగవద్గీతను మరింత మందికి చేరువ చేయాలనే సంకల్పాన్ని బలపరిచిందని సమతాదేవి చెబుతున్నారు. గోల్డ్ మెడల్ స్ఫూర్తితో గీతాజ్ఞానాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆన్‌లైన్ ద్వారా ప్రతిరోజు 25 మంది శిష్యులకు ఆమె భగవద్గీత శ్లోకాలను బోధిస్తున్నారు.

ప్రస్తుత కాలంలో వేగవంతమైన జీవనశైలి, ఒత్తిళ్లు, పోటీ వాతావరణంలో భగవద్గీతలోని సందేశాలు ఎంతో ప్రాసంగికమని సమతాదేవి భావిస్తున్నారు.  700 శ్లోకాలను కంఠస్థం చేయడం.. మరోవైపు ప్రతి శ్లోకానికి అర్థాన్ని వివరించడం ద్వారా సమతాదేవి ఆధ్యాత్మికతకు, జ్ఞానానికి వారధిగా నిలుస్తున్నారు. భగవద్గీతను చదివే వారితోపాటు, గీతను అర్థం చేసుకోవాలనుకునే వారికి ఆమె వివరణలు ఉపయోగపడుతున్నాయి.

 బండి సంపత్‌కుమార్,