10 March, 2026 | 8:50 AM

నవ్వించే ‘మహిళా లోకం’

10-03-2026 12:00 AM

బృహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్లపై హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘లేచింది మహిళాలోకం’. దర్శకద్వయం అర్జున్-, కార్తిక్ రూపొందించిన ఈ సినిమాలో మంచు లక్ష్మి, శ్రీరామచంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం మార్చి 26న థియేటరల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా మూవీటీమ్ సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ.. “సీరియస్ సబ్జెక్టును కామెడీగా చెప్తేనే వింటాం. నేను కామెడీ విషయంలో రెచ్చిపోయి చేశా. ఆడవాళ్లందరూ చూస్తే చాలు. ప్రమోషన్స్‌లో చూపించిన బ్లూ డ్రమ్‌కు మా సినిమాకు సంబంధం ఉండదు. ‘లేచింది మహిళాలోకం’ మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు.. అందరినీ నవ్వించే చిత్రం” అన్నారు.

‘యాక్టర్స్ అందరి డెడికేషన్ వల్లే సినిమా అనుకున్న విధంగా వచ్చింద’ని డైరెక్టర్ అర్జున్ చెప్పారు. మరో డైరెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ.. “ఇది ఫన్ రైడింగ్ ఫిల్మ్. థియేటర్లలో అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా” అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ.. “ఇండస్ట్రీ మాకు కొత్త. ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నుంచి వచ్చాం.

మొదటి ప్రయత్నంలోనే ఇంత మంచి సినిమా తీశాం. అందరూ ప్రోత్సహిస్తే ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో తీసుకొస్తాం” అని అన్నారు. హీరోయిన్ అనన్య నాగళ్ల, నటీనటులు హరితేజ, హేమ,  సింగర్, యాక్టర్ శ్రీరామచంద్ర,  తదితరులు పాల్గొన్నారు.