త్వరలో ట్రైబల్ వర్సిటీ పనులు
- రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- హైదరాబాద్‌లో పెట్రోలియం ఉత్పత్తుల టెర్మినల్
- మహబూబ్‌నగర్‌లో రూ.3,175 కోట్లతో జాతీయ రహదారి పనులు
- మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): త్వరలోనే సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ పనులను ప్రారంభిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మే 10న హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ రూ.7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడుతూ సమ్మక్క--సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవి ద్యాలయానికి సుమారు రూ.1,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చిందని, ప్రస్తుతం ఇది తాత్కాలిక క్యాంపస్‌లో నడుస్తోందన్నారు.
ఇటీవలే భూమిని పూర్తిగా కేంద్ర విద్యాశా ఖకు అప్పగించామని, భూమి అప్పగించిన వెంటనే కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. డిజైన్లు సిద్ధంగా ఉన్నాయని, ప్రస్తుతం టెండర్ దశలో ఉందని, త్వరలోనే పూర్తి స్థాయి క్యాంపస్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మే నెల 10వ తేదీ, ఆదివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణకు వస్తున్నారన్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలం గాణ ప్రజలు బీజేపీపై అపార విశ్వాసం చూ పించారని, రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల శాతం గణనీయంగా పెరగడం, గ్రామం నుంచి జిల్లా వరకు బీజేపీ బలపడటం మోదీ నాయకత్వంపై ప్రజల నమ్మకానికి స్పష్టమైన నిదర్శనమన్నా రు. ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ మరి ంత బలంగా ఎదిగిందని, సుమారు 40 లక్షల మంది కొత్త సభ్యులు పార్టీలో చేరడం జరిగిందన్నారు.
బూత్ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేశామన్నారు. అదే విధంగా టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజ యం సాధించడం.. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణలో పార్టీ బలం పెరిగిందన్నారు.
రూ.7,823 కోట్ల అభివృద్ధి పనులు..
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా సుమారు రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించ డంతో పాటు, కొన్ని ప్రాజెక్టులను తెలంగాణ ప్రజలకు అంకితం చేయనున్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇప్పటికే అనేక ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు. త్వరలో ఢిల్లీలో జరిగే సమావే శంలో మరిన్ని ప్రాజెక్టులకు ఆమోదం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
రైల్వే రంగంలో తెలంగాణకు సుమారు రూ. 85,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, పలు ప్రాజెక్టులు 90 శాతం వరకు పూర్తిఅయ్యాయని, మిగతా పనులు పూర్తిచేయడానికి ట్రయల్స్ నిర్వహిస్తూ, ఉపాధి అవ కాశాలు ఎలా పెంచాలో కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ ప్రాజె క్టు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని, అయితే భూసేకరణ ఇంకా పూర్తికాలేద న్నారు. అది పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. తార్నాక ప్రాంతంలో రూ.400 కోట్లతో నేషనల్ సైన్స్ సెంటర్ నిర్మాణం కొనసాగు తోందన్నారు.
ట్రిపుల్ ఆర్ పనులు ప్రారంభం..
ఇంకా కొన్ని కీలక ప్రాజెక్టులు క్యాబినెట్ ఆ మోద దశలో ఉన్నాయని, రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి సంబంధించిన డీపీఆర్ పను లు కొనసాగుతున్నాయన్నారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని, అది పూర్తయిన తర్వాత కేంద్ర క్యాబినెట్ ఆమోదం తీసుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలనే ప్రణాళికలో ఉన్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా 12 గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని, అందులో తెలంగాణలోని జహీరా బాద్‌కు ఒకటి కేటాయించబడిందన్నారు.
ఇది నేషనల్ హైవే 65 సమీపంలో, రెండు మండలాల మ ధ్య అభివృద్ధి చేయబడుతోందని, హైదరాబాద్ నుంచి సుమారు 80 కిలోమీటర్లు, ఎయిర్‌పోర్ట్ నుండి 100 కిలోమీటర్ల దూరం లో ఉండటం వల్ల కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందన్నారు. వరంగల్లో రైల్వే మాన్యు ఫ్యాక్చరింగ్ యూనిట్, అలాగే కాకతీయ పీఎం మిత్ర మెగా టెక్స్‌టై పార్క్‌ను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు.
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభు త్వాలు కలిసి సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయని, దీని ద్వారా తెలంగాణలో భారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అదే విధంగా, మహబూబ్‌నగర్ ప్రాంతంలో సుమారు రూ. 3,175 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారన్నారు.
హైదరాబాద్‌లో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన ఒక పెద్ద టర్మినల్‌ను ప్రారంభించనున్నామని, ఇందులో పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్, లూబ్రికెంట్స్ నిల్వ, సరఫరా సదుపాయాలు ఉంటాయన్నారు. కా జీపేట నుంచి విజయవాడ వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణం పూర్తయిందని, సుమారు రూ.1,243 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడం జరిగిందని, దీనిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారన్నారు.
కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇనాగరేషన్స్ ఈ నెల 10వ తేదీన జరగనున్నాయని, ఇది మొదటి దశ మాత్రమే.. దశలవారీగా తెలంగాణలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకా రం చుడతామన్నారు. కానీ కేంద్ర పనులను ప్రతిపక్ష పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఈ వ్యవహారం కొనసాగుతోందన్నారు.






