టీఆర్‌ఎస్‌కు లైన్‌క్లియర్
- ‘తెలంగాణ రక్షణ సేన’కు సీఈసీ ఆమోదం
- కవితకు అధికారిక లేఖను అందజేసిన అధికారులు
- టీఆర్‌ఎస్ నాకు రాసిపెట్టుందేమో..
- ట్విట్టర్ వేదికగా కల్వకుంట్ల కవిత హ్యాపీ పోస్టు
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పేరును కేంద్ర ఎన్నికల సంఘం అధి కారికంగా ఆమోదించింది. ఈ పేరును కల్వకుంట్ల కవితకు కేటాయిస్తూ సీఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బంజారాహిల్స్‌లోని కవిత నివాసం లో అధికారిక లేఖను సీఈసీ అధికారులు ఆమె కు అందజేశారు. దీంతో ‘టీఆర్‌ఎస్ నాకు రాసిపెట్టుందేమో..’ అని సంతోషం వ్యక్తం చేస్తూ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.
తెలంగాణ ఉద్యమ ధీరుడు, బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తరహా చాణక్యంతో కవిత పార్టీ పెట్టి, అన్ని పార్టీలకు జలక్ ఇచ్చి, నూతన వరవడి సృష్టించారు. భేషజాలకు పోకుండా రాజకీయ పార్టీ పేరు ఎంపికలో ఆచితూచి వ్యవహరించారు. సీఈసీ గ్రీన్‌సిగ్నల్‌తో టీఆర్‌ఎస్ పేరుతో ఇక రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియ పూర్తిస్థాయిలో ముందుకు సాగనుం ది. ఇటీవల ఈనెల 25న మేడ్చల్‌లోని అద్వ య కన్వెన్షన్‌లో జరిగిన సభలో కవిత పార్టీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.
పార్టీ పేర్ల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె ప లు ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి వంటి పేర్లను సూచించగా.. వాటిలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పేరునే సీఈసీ ఖరారు చేసింది. ఈ పరిణామంపై పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్ పేరుతో కవిత రాజకీయ కార్యకలాపాలను మ రింత వేగవంతం చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణ రాజకీయాల్లో ఈ నిర్ణయం కొత్త చర్చలకు దారి తీస్తోంది. అయితే ‘తెలంగాణ రక్షణ సేన’కి సీఈసీ ఆమోదం తెల్పడంపై పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘టీఆర్‌ఎస్ నాకు రాసిపెట్టుందేమో’ అని తెలిపారు. తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నా మని పేర్కొన్నారు.
రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం ‘నేను చేసిన కృషి’ని కొనసాగిస్తూ, ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పనిచేస్తానని తెలియజేశారు. జనవరి 2026లో జాతీయ ఎన్నిక ల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని, అందులో మూడో ప్రాధాన్యతగా ‘మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం’ అని వెల్లడించారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా కేసీఆర్‌కు పేరుం ది.
అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేయడం వెనుక ఆయన చాణక్య నీతి ఎంతో ఉంది. ఆ చాణక్య నీతినే నూటికి నూరుపాళ్లు ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత అందిపుచ్చుకున్నారు. రాజకీయ పార్టీ పేరు ప్రకటనతోనే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు జలక్ ఇచ్చారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కవిత తన రాజకీయ చాణక్యతను ప్రదర్శించారు.
భేషజాలకు పోకుండా రాజకీయ పార్టీ పేరు ఎంపికలో ఆచితూచి వ్యవహ రించారు. సంక్షిప్తంగా ‘టీఆర్‌ఎస్’ అని వచ్చేలా ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ పేరుకు అధికారిక అనుమతులు సొంతం చేసుకున్నారు. కొద్దిపాటి సాంకేతిక ప్రక్రియ తర్వాత టీఆర్‌ఎస్ పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు.
టీఆర్‌ఎస్ చాలా పాపులర్..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్ చాలా పాపులర్. ప్రజలకు ఈ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీఆర్‌ఎస్ పేరును సొంతం చేసుకోవడం ద్వారా తెలంగాణ స్వీయ అస్తిత్వ పరిరక్షణకు పాటు పడే ఏకైక స్థానిక పార్టీ తమదేనని కవిత బలంగా చెప్పుకుంటున్నారు. ఈసీ అనుమతి తర్వాత చేసిన ట్వీట్‌లోనూ ‘టీఆర్‌ఎస్’ తనకు రాసిపెట్టి ఉందేమోనని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ జాతీయ పార్టీలే... తెలంగాణ పేరుతో ఒక్కటంటే ఒక్క ప్రధాన ప్రాంతీయ పార్టీ కూడా తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై లేదు. వలస పాలనకన్నా దారుణంగా తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోన్న ప్రస్తుత తరుణంలో టీఆర్‌ఎస్ పేరుతోనే ప్రజల్లోకి వెళ్లాలని కవిత నిర్ణయించారు. ఆమె సంకల్పానికి దైవబలం కూడా తోడు కావడంతో టీఆర్‌ఎస్ పార్టీ పేరును ఆమెకు ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.






