చిన్నారుల అక్రమ రవాణాలో మురుగన్ గ్యాంగ్
- హైదరాబాద్‌లోనూ చైల్డ్ ట్రాఫికింగ్!
- ఒక్క ఏడాదిలోనే 25 మంది చిన్నారుల విక్రయం?
- మూడు ఫెర్టిలిటీ సెంటర్లలో గుజరాత్ పోలీసుల తనిఖీలు
సికింద్రాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని పలు ఫెర్టిలిటీ సెంటర్లు చిన్నారుల అక్రమ రవాణాకు సహకరించడం కలకలం రేపుతోంది. చిన్నారుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు మురుగన్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో చిన్నారుల అక్రమ రవాణాకు సహకరిస్తున్న మూడు ఫెర్టిలిటీ సెంటర్లలో గుజ రాత్ పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. ఈ కేసులో మురుగన్ గ్యాంగ్‌ను గతంలోనే గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు.
మురుగన్ గ్యాంగ్ ఇచ్చిన సమాచారంతో అతడి నెట్‌వర్క్‌పై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే మురుగన్ గ్యాంగ్‌కు సహకరించారన్న ఆరోపణలొచ్చిన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, సికింద్రాబాద్, బంజారాహిల్స్‌లోని ఫెర్టిలిటీ సెంటర్లలో గుజరాత్ పోలీసులు సోదాలు చేశారు. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మురుగన్ అలియాస్ నాగరాజు ఆదిలాబాద్‌లో గతేడా ది వరకు ఇటుకల బట్టిలో కూలీగా పనిచేశాడు. ఒక్క ఏడాదిలోనే చైల్డ్ ట్రాఫి కింగ్‌లో కింగ్ పిన్‌గా ఎదిగాడు.
గతేడాది దిల్‌సుఖ్‌నగర్ పరిధిలోని చైతన్యపురిలో నమోదైన పిల్లల అక్రమ రవాణా కేసులో మురుగన్‌ను అరెస్టయ్యాడు. దీంతో గతేడాది 3 నెలల పాటు జైలు జీవితం గడిపాడు. అనంతరం జూలైలో విడుదలై బయటకు వచ్చాడు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా చైల్డ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు గుజరాత్ పోలీసులు గుర్తించారు. మురుగన్ భార్య కృష్ణవేణి కూడా మరో గ్యాంగ్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు. ఒక్క ఏడాదిలోనే మురుగన్ గ్యాంగ్ 25 మంది చిన్నారుల విక్రయాలు చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం గుజరాత్ పోలీసుల అదుపులో ఉన్న మురుగన్ గ్యాంగ్‌కు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనేదానిపై అధికారులు దృష్టి సారించారు. గుజరాత్‌లోని బనాస్‌కాంతలో దేవ్ అనే నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. పోలీసులు కిడ్నాపింగ్ ముఠాను గుర్తించి బాలుడిని కాపాడారు. ఈ క్రమంలో మురుగన్ పేరు బయటకు వచ్చింది. పాతరికార్డులను తిరగేశారు. పూర్తి వివరాలు సేక రించారు.
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణం నౌగాం బస్తీకి చెందిన మురుగన్‌ను, అతడి ముఠాలో ఉన్న కాసారపు తిరపతి, కాసారపు మల్లయ్యలను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ లో కృష్ణవేణి, అమూల్య పేర్లు బయటకు రాగా ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో ఏజెంట్లను నియమిం చుకొని పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేవారు.






