1 May, 2026 | 2:19 AM

లోగుట్టు పేరుమాళ్లకెరుక!

01-05-2026 01:20 AM

సీఎం రేవంత్‌పై ఇటీవల తీవ్ర పదజాలాన్ని వాడిన కల్వకుంట్ల కవిత 

పెద్దగా స్పందించని కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్, ఏప్రిల్ ౩౦ (విజయక్రాంతి) : లోగుట్టు తెలిసి ఊరుకుండిపో వచ్చు.. లోగుట్టు తెలియకపోతే మండిపడనూవచ్చు. ఈ రెండింటిలో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించిన తీరుపై రాజకీయ విశ్లేషకుల్లో అనుమానాలు రేకెత్తు తున్నాయి.

ప్రతిపక్షం కాకపోయినప్పటికీ, ఒక కొత్త ప్రాంతీయ పార్టీని ప్రకటించి.. వేలాది మంది మద్దతుదారుల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రమైన పదజాలంతో కవిత చేసిన వ్యాఖ్యలపై అటు పార్టీ నుంచిగానీ.. ఇటు ప్రభుత్వంలో సహచరులైన మంత్రుల నుంచిగానీ ఎలాంటి ఖండనలు, ప్రతి విమర్శలు, మండిపడటాలు లేకపోవడం గమనార్హం.

కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ మాత్రం కొత్త పార్టీనీ స్వాగతిస్తున్నామని, కవితకు అభినందనలు తెలుపుతూ.. ఏదో నామమాత్రంగా సీఎం రేవంత్ పై కవిత చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం అంటూ కొట్టిపడేశారు. అంతకుమించి కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై ఎలాంటి ఘాటు, తీవ్రమైన స్పందన రాలేదు.

ఇక మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరి నోటి నుంచి ఒక్క మాటకూడా రాకపోవడాన్ని రాజ కీయ విశ్లేషకులు ఎత్తిచూపుతున్నారు. మంత్రివర్గంలోని సహచరులందరూ ముఖ్యమంత్రికి మద్దతుగా నిలవాల్సిన సమ యంలో, కవిత వ్యాఖ్యలను ఖండించాల్సిన సందర్భంలో వారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంతో.. అసలు సీఎంకు మంత్రివర్గసహచరుల నుంచి మద్దతు ఉందా అనే అనుమానాలు వ్యక్తంకావడం గమనార్హం.

లోగుట్టు ఏమిటి..?

వాస్తవానికి కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు చేయడం.. సీఎం రేవంత్ మార్గదర్శకంలోనే జరుగుతోందనే ప్రచారం మొదలయ్యింది. ఒకవేళ అదే నిజమైతే.. అందుకే సీఎంపై కవిత ఘాటుగా వ్యాఖ్యలు చేసినా మంత్రులు స్పం దించలేదా అనే అనుమానాలుకూడా వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి కవిత బయటకు వచ్చి మంచి పనే చేశారని, దీనివల్ల తమకు రాజకీయంగా లాభమనే ఆలోచనతో మంత్రివర్గసహచరులు ఉన్నారా అనేఅనుమానాలు కూడా వ్యక్తమ వుతున్నాయి.

రేవంత్‌రెడ్డిని తామెలాగూ విమర్శించలేం.. కనీసం విమర్శించేవారిని చూసైనా సంతోషిద్దామని ఊరుకుంటున్నారా అని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి సీఎం రేవంత్‌రెడ్డిపై కల్వకుంట్ల కవిత ఘాటుగా చేసిన విమర్శలపై అధికార పార్టీ నుంచి పెద్దగా స్పందన లేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ‘ఈ రాష్ట్రాన్ని ఒక కర్కోటకుడు పరిపాలన చేస్తుండు. ఒక పొలిటికల్ లీడర్‌ను కర్కోటకుడు అనాలంటే బాధ అనిపిస్తుంది.

కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే.. మొన్న ఖమ్మం వెలుగుమట్లలో అన్నీ అనుమతులు ఉన్నా.. అర్ధరాత్రి పోయి ఇండ్లు కూలగొడితే.. ఒక నిండు గర్భిణీ టెన్షన్‌తో అబార్షన్ అయితే, ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు.. చేసిన రోదనలు ఇంకా ఈ చెవుల్లో వినపడుతూనే ఉంది. అందుకే ఇప్పుడు ఉన్న సీఎంను కర్కోటకుడనే అంటా.. హిట్లర్ అనే అంటా. కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసికందు చనిపోతే ఇప్పటివరకు కేసు పెడతలేరు.

హోం మంత్రికూడా ముఖ్యమంత్రే. ఆయనకు తీరిక లేదు పాపం. అందుకే కర్కోటకుడు అయిన సీఎం పరిపాలనలో ఉన్నాం.. ఖచ్చితంగా కొట్లాడాల్సిందే మనం. విద్యా శాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడు తలేడు. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం.. అందుకే హిట్లర్ అంటా ఉన్నాం’.. అని కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ప్రకటన సభలో అన్నారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ స్పందిస్తూ.. ‘ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలకు స్వాగతం. కవిత పార్టీ పెట్టినందుకు అభినందనలు.

2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ దోపిడీలో కవితకు భాగస్వా మ్యం ఉంది. దోపిడీపై కవిత వివరణ ఇవ్వడం లేదు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్‌పై కవిత వ్యాఖ్యలు అర్ధరహితం. మహిళ కేంద్రంగా ప్రజాపాలన సాగుతోంది. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన చేస్తున్నారు. కేసీఆర్ చుట్టూ గుంటనక్కలు ఉన్నాయా.. పంది కొక్కులు ఉన్నాయా.. పదేండ్లలో కవితకు తెలియదా. రాజకీయాల్లో ఆశ ఉండాలి. అత్యాశ ఉండకూడదు’.. అని వ్యాఖ్యనించారు.