పశ్చిమాసియాలో పోరు భీకరం
గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబసీలపై ఇరాన్ దాడులు
- లెబనాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. హెజుబుల్లా స్థావరాలు టార్గెట్
- ఇరాన్ అధ్యక్షుడి భవన సముదాయంపై క్షిపణుల దాడి
- ఇరాన్‌లో 787 మంది మృతి..
- గల్ఫ్ నౌకల్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు భారతీయులు
- చర్చల్లేవ్.. ఇప్పటికే చాలా ఆలస్యమైంది: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ఇరాన్ చర్చల ప్రతిపాదన తిరస్కరణ
- భారత్‌కు రష్యా భరోసా.. చమురు కొరత వస్తే సరఫరాకు సిద్ధం
* మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు రగులుతున్నాయి. ఇరాన్ మంగళవారం గల్ఫ్ దేశాల్లోని అమె రికన్ ఎంబసీలపై డ్రోన్ల వర్షం కురిపించింది. కువైట్‌పై క్షిపణి దాడుల్లో ఆరుగురు అమెరికన్ సైనికులు మృతిచెందారు. ఫుజైరా చమురు కేంద్రంపై డ్రోన్ ప్రయోగించగా, వాటిని యూఏఈ సైన్యం కూల్చివేసింది. ఆ శిథిలాలు పడి చమురు కేంద్రంలో మంట లు చెలరేగాయి.
ఒమన్ తీరంలోని నౌకలపై ఇరాన్ దాడులు చేయగా, దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందారు. లెబనాన్‌లోని హిజుబుల్లా స్థావరాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. బీరుట్‌లో క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్‌లోని అధ్యక్ష కార్యాలయంపైనా క్షిపణులు ప్రయో గించింది. మరోవైపు, ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని ఆపే ప్రసక్తే లేదని అగ్రరాజ్యం తేల్చిచెప్పింది. ఈ పరిణామాలు చూస్తుంటే యుద్ధం మరింత ఉధృత మయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
టెహ్రాన్, మార్చి ౩: గల్ఫ్ దేశాలు పూర్తిగా యుద్ధమేఘాల్లో కూరుకుపోయింది. ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆయా దేశాలపై దాడులు చేస్తున్నది. ఆ దాడులను మంగళవారం మరింత ఉధృతం చేసింది. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలను, రాయబార కార్యాలయాలను టార్గెట్ చేసింది. కనీ విని ఎరుగని రీతిలో డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అలాగే తన ప్రధాన శత్రువైన ఇజ్రాయెల్‌పై వందలాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.
టెల్ అవీవ్, హైఫా వంటి నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. దాడుల్లో 12 మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించగా, వందలాది మందిగ గాయాలపాలైనట్లు సమాచారం. డాడుల కారణంగా కొన్ని విమానాశ్రయాలు, ఇంధన నిల్వ కేంద్రాలు దెబ్బతిన్నాయి.
ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్‌లోని ఒక పాఠశాలలో మరణించిన వారి సంఖ్య 787కు పెరిగింది. ఇరాన్‌కు చెందిన రెడ్ క్రీసెంట్ సొసైటీ ఈ గణాంకాలను వెల్లడించింది.
సౌదీలోని రియాద్‌పై..
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. ఆ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి శబ్దం వినిపించింది. నల్లటి దట్టమైన పొగ ఆకాశంలోకి వ్యాపించాయి. దాడిలో రెండు డ్రోన్లు అమెరికా ఎంబసీని తాకాయని, భవనం స్వల్పంగా దెబ్బతిన్నదని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.
కువైట్‌లో అమెరికా స్థావరాలపై
అమెరికా సైనిక బలానికి కేంద్రమైన కువైట్‌పై ఇరాన్ భీకరంగా విరుచుకుపడింది. అక్కడి ‘ఆలీ అల్ సలేం’ ఎయిర్ బేస్‌పై డ్రోన్లతో దాడులు చేసింది. దాడుల్లో ఆరుగురు అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఒమన్ తీరంలో నౌకల ధ్వంసం
ఒమన్ తీరంలోని డక్మ్ నౌకాశ్రయంపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. దాడిలో అక్కడి ఇంధన స్థావరాలు దెబ్బతిన్నాయి. దీంతో నౌకాశ్రయం నుంచి చమురు రవాణా నిలిచిపోయింది. పశ్చిమ దేశాలకు ఒమన్ సహకరిస్తోందనే ఆగ్రమంతో ఇరాన్ దాడులు చేస్తోంది. దాడుల కారణంగా ఒమన్ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లింది.
ఖతార్‌లో ఉద్రిక్త పరిస్థితులు
ఖతార్‌లోని అమెరికా స్థావరాలను కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. అల్ ఉదైద్ ఎయిర్ బేస్ సమీపంలో క్షిపణుల వర్షం కురిపించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఎల్‌ఎన్జీ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. మిగతా ప్రపంచ దేశాలకు గ్యాస్ సరఫరా చేసే దేశం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గ్యాస్ ధరల పెరుగుదలకు కారణం కాబోతున్నది.
యూఏఈపైనా
దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో యూఏఈ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఇరాన్ నుంచి యూఏఈ పైకి 186 క్షిపణులు దూసుకొచ్చాయి. వీటిలో మెజారిటీ క్షిపణులను యూఏఈ గాలిలోనే కూల్చివేసింది. దాడుల్లో ముగ్గురు మరణించగా 68 మంది గాయపడ్డారు. యూఏఈలోని కీలక కేంద్రాలపై ఇరాన్ డ్రోన్లు నిఘా పెట్టినట్లు సమాచారం. ఇక్కడ ఉన్న విదేశీ పెట్టుబడులు, పర్యాటక రంగం యుద్ధం వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంది. అమెరికా యుద్ధ విమానాలు ఇక్కడి నుంచి ఇరాన్ పైకి వెళ్లకుండా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.
తమ గగనతలాన్ని యుద్ధానికి వాడనివ్వబోమని యూఏఈ స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ ఇరాన్ మాత్రం ఆయా ప్రాంతాలపై క్షిపణి దాడులకు సిద్ధంగా ఉంది. ఫుజైరా చమురు నిల్వ కేంద్రంపై డ్రోన్లతో దాడి చేసింది. ఆ డ్రోన్లను యూఏఈ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. అలా కూల్చివేసిన డ్రోన్ శిథిలాలు నేరుగా చమురు కేంద్రంపై పడ్డాయి. దీంతో అక్కడ అగ్నిప్రమాదం సంభవించింది. ఆకాశమంతా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు
టెహ్రాన్‌లో మంగళవారం అశ్రనయనాల మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతోపాటు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ, పలువురు ఉన్నత స్థాయి సైనిక అధికారుల అంత్యక్రియలు జరిగాయి. వారి భౌతికకాయాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు, లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు.
ఖమేనీ చిత్రపటాలను చేతబూని సంతాపం ప్రకటించారు. ప్రభుత్వ పెద్దలు, సైనిక కమాండర్లు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించారు. తమ సుప్రీం లీడర్ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రతిజ్ఞ చేశారు. అలాగే యుద్ధంలో మరణించిన మిగతావారి అంత్యక్రియలు కూడా పలుచోట్ల జరిగాయి.




