6 April, 2026 | 5:13 AM

ఈస్టర్ పండుగ యేసుక్రీస్తు పునరుత్థానానికి సంకేతం

06-04-2026 12:00 AM

రూ 150 లక్షలతో కల్వరీ కొండ ప్రాంగణం అభివృద్ధి సుందరీకరణ 

ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్నగర్, ఏప్రిల్ 5 (విజయ క్రాంతి) : నగరంలోని కల్వరి కొండపై ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించిన వేడుకలకు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.   అనంతరం మాట్లాడుతూ ఈస్టర్ పండుగ యేసుక్రీస్తు పునరుత్థానానికి ప్రతీక అని పేర్కొన్నారు. యేసు క్రీస్తు చూపిన ప్రేమ, శాంతి, సహనం, క్షమ వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు.

యేసు పునరుత్థానం మన జీవితాలకు ఆశ, విశ్వాసం, నూతన ఆరంభాలకు మార్గదర్శకమని తెలిపారు. అన్ని మతాల మధ్య సౌభ్రాతృత్వం, ఐక్యత పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కల్వరి కొండ ప్రాంత అభివృద్ధి కోసం మొత్తం రూ.242 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు పనులను వివరించారు.

అందులో భాగంగా బోయపల్లిలోని పాత మరియు కొత్త స్మశానవాటికల వద్ద షెడ్ల నిర్మాణం, కమలా నెహ్రూ కాలనీలో షాలేం ఎం.బి. చర్చి వద్ద షెడ్ నిర్మాణం, మిషన్ కాంపౌండ్లోని కల్వరి ఎం.బి. చర్చి వద్ద మరుగుదొడ్ల నిర్మాణం, కల్వరి టెంపుల్ రోడ్ నుండి స్మశానవాటిక వరకు సీసీ రోడ్డు నిర్మాణం, అలాగే కల్వరి కొండ ప్రాంగణ అభివృద్ధి మరియు సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్ సిబి శ్రీపూజిత, సిజె బెనహర్, ఫాస్టర్ రెవ. వరప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, చర్చ్ పాస్టర్లు, ప్రముఖులు, యువత, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.