6 April, 2026 | 1:21 AM

మొదటి వారికే మోక్షం.. చివరికి అందని సాగునీరు

06-04-2026 12:00 AM

ఎండుతున్న పంటలు

పంట పొలాల వద్ద రైతుల జాగరణ

కల్వకుర్తి, ఏప్రిల్ 5: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు సమృద్ధిగా అందుతుందనే ఆశతో ఈ సీజన్లో అనేకమంది రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న పంటను సాగు చేశారు. అయితే పంట చేతికొచ్చే కీలక దశలో కృష్ణా జలాలు అందక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గత నెల రోజులుగా నీటి సరఫరా సరైన స్థాయిలో లేకపోవడంతో మొక్కజొన్న పంట ఎండిపోయే ప్రమాదంలో పడింది. కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గడం, ముఖ్యంగా శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ తగ్గిపోవడం వల్ల కాలువల ద్వారా నీటి సరఫరా దెబ్బతింది.

కల్వకుర్తి , నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సాగునీరు అందించే 29వ ప్యాకేజీ ప్రధాన కాలువలో గత నెల రోజులుగా నామమాత్రంగా నీళ్లు పారుతుండడంతో అవి చివరి వరకు చేరడం లేదు. 

మొదటి వారు నీటిని మలుపుకుంటున్నారు. 

నీరు సమృద్ధిగా పారితే మొదటి నుండి చివరి వరకు అందరికీ సమానంగా వెళ్లేలా కాలువలపై అధికారులు తూములు  నిర్మించారు. అవసరానికి అనుగుణంగా డిస్ట్రిబ్యూటరీ కాలువలకు నీవు విడుదల చేసేలా ఏర్పాట్లు చేసినప్పటికీ వాటి నిర్వహణ పట్టించుకోకపోవడంతో కొంతమంది రైతులు అధికారులకు తెలియకుండానే నీటిని మలుపుకుంటున్నారు . దీంతో వచ్చే కొద్దిపాటి నీరు అక్కడికే సరిపోతుండడంతో కాలువలోని నీళ్లు ముందు సాగడం లేదు. 

చివరకు ఉన్న కొంతమంది రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు తూముల వద్దకు వెళ్లి రాత్రింబవళ్లు కాపలా కాయాల్సిన పరిస్థితి నెలకొంది.  అధికారులు మరో వారం రోజుల్లో నీటి సరఫరాను పునఃప్రారంభించే అవకాశముందని చెబుతున్నప్పటికీ, అప్పటి వరకు పంటలు నిలబడతాయా అనే సందేహం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది, పంట చేతికి వచ్చే వరకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు .