అనుమతులు గోరంత తరలింపులు కొండంత
మొరం తరలింపులో మాఫియా ఆగడాలు
జెసిబి, ట్రాక్టర్ల సహాయంతో అక్రమంగా మొరం తరలింపు
చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
మామూళ్ల మత్తుకు తలోగ్గుతున్న అధికారులు
మొరం మాఫియా ఆగడాలపై ప్రజల ఆగ్రహం
బిచ్కుంద, ఏప్రిల్ 5 (విజయక్రాంతి); అనుమతులు గోరంత తీసుకొని ఉన్నంత తవ్వకాలు చేపడుతున్నారు. అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతూ డబ్బు సంపాదిస్తున్నారు. మొరం మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో మోరం మాఫియా ఆగడాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొన సాగిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు కేవలం ఒక ట్రిప్ కు కేవలం 300రూపాయలపైచిలుకు రుసుము చెల్లించి బహిరంగ మార్కెట్లో 700రూపాయల మొదలుకొని 800 రూపాయలు అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు.
బిచ్కుంద మున్సిపల్ గా మారిన తరుణంలో మున్సిపల్ అధికారుల ద్వారా గృహ నిర్మాణ పనుల అనుమతి మాటున స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద తూతూమంత్రంగా కొంతమేర అనుమతులు పొంది పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు ద్వారా, జెసిబి లు పెట్టి తవ్వకాలు చేపడుతున్నారు. అక్రమంగా మోరం తరలింపులు చేపట్టడం గమనించదగ్గ విషయం. ఈ విషయాన్ని తహశీల్దార్ వేణుగోపాల్ ను విజయ క్రాంతి ప్రతినిధి అక్రమ మొరం దందా ప్రస్తావించగా తమ వద్ద సరిపడ సిబ్బంది లేనందున దృష్టి సారించలేకపోతున్నామని తెలిపారు. ఇదిలాఉంటే గతంలో ఎంతమేర మోరం ట్రిప్పులకు అనుమతులు చలానా రూపంలో చెల్లిస్తే అంతే సంఖ్యలో టోకెన్లు జారీచేసి తమ సిబ్బంది పర్యవేక్షణలో తరలింపులు చేసేవారు.
అంతేకాకుండా ఒక ట్రిప్పు మొరంకోసం కేవలం 80రూపాయల నుండి మొదలుకొని 120 రూపాయలు చలానా రుసుము ఉండేది. ఫలితంగా రవాణా చార్జీలు కలిపి ప్రజలకు కేవలం 180రూపాయల మొదలుకొని 300రూపాయలు కు మాత్రమే మొరం ట్రిప్పు లభించేది. అమాంతంగా ప్రభుత్వ పరంగా రెట్టింపు ధరల నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు అందక దళారుల పాలిట వరంగా మొరం దందా మారి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే విధంగా వ్యవహారం కొనసాగిస్తున్నారు. చలానా రుసుములు తగ్గించి పకడ్బంది పర్యవేక్షణ చర్యలు తీసుకుంటే రోజువారీ అనుమతులు మంజూరు చేస్తే ప్రభుత్వ ఆదాయం పెరిగి ప్రజాసంక్షేమ పతకాలకు బారీగా నిధులు సమకూరే అవకాశం ఉందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొరం దందా అక్రమ ఆగడాలపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరు తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉపయోగపడే మొరం ట్రిప్పు ధరలను తగ్గించాలని స్థానికులు కోరుతున్నారు.




