15 April, 2026 | 11:52 PM

కాంగ్రెస్ అసమర్థ పాలనలో ఆర్థిక వ్యవస్థ పతనం

14-04-2026 12:34 AM

గజ్వేల్ మాజీ ఏఎంసి చైర్మన్ మాదాసు శ్రీనివాస్

గజ్వేల్, ఏప్రిల్13: కాంగ్రెస్ అసమర్థ పాలనలో ఆర్థిక వ్యవస్థ పతనం అయిందని గజ్వేల్ మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాచు శ్రీనివాస్ అన్నారు. గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి చెందిన ఆందోలు గణేష్ తండ్రి రాజయ్య అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా, ముఖ్యమంత్రి నిధుల నుండి మంజూరు అయిన రూ.2 లక్షల (LOC) సహాయాన్ని సోమవారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అందజేశారు.

ఈ సహాయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి సహకారంతో మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రిలీఫ్ ఫండ్ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఎక్కడ అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చే ఆర్థిక సహాయం, వృద్ధులకు పెన్షన్లు, దివ్యాంగులకు పెన్షన్ పెంపు వంటి హామీలు కూడా అమలు కాలేదని పేర్కొన్నారు.

రైతులకు రైతు భరోసా పేరుతో రూ.15,000 ఇస్తామని చెప్పి, రైతుబంధునే సక్రమంగా అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అయిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ రామ రాజ్యం వస్తుందని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బ్యాగారి ప్రభాకర్, ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ చాడ శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అహ్మద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నిజామొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.