వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, ఏప్రిల్ -13(విజయ క్రాంతి): ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.
ఎండదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ఎండలో బయట తిరగవద్దని, అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు బయటికి రాకూడదని, చిన్నారులు, వయోవృద్దులు ఇంటికే పరిమితం కావాలని, ప్రతిరోజు సరిపడ త్రాగునీరు తీసుకోవాలని, వదులుగా ఉన్న దుస్తువులను ధరించాలని, బయటికి వెళ్ళేటప్పడు గొడుగు, టోపిని, సన్నని లేత రంగు కాటన్ వస్త్రాలను దరించాలని, ద్విచక్ర వాహానాలపై సుదూర ప్రయాణాలు చేయకూడదని, సూర్యుని కిరణాలు శరీరంపై నేరుగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
అలాగే ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటీతో పాటు ఓ.ఆర్.ఎస్. ద్రావణాన్ని తీసుకోవాలని తద్వారా వడదెబ్బ నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చన్నారు. అధిక మాంసకృత్తులు కలిగిన ఆహారాన్ని , నిల్వ ఆహారాన్ని తినవద్దని, నిలిపి ఉంచిన వాహనంలో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలివేయవద్దని, వాహనం లోపల ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదకరంగా మారవచ్చని అన్నారు.
అధిక చమట, దాహం, బలహీనత, తల తిప్పడం, కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు వున్నచో వడదెబ్బగా భావించి సమీప ఆరోగ్య కేంద్రం తీసుకెళ్లాలని కోరారు. అదే విధంగా వీరికి సహాయం అందే వరకు చల్లని ప్రదేశానికి తరలించాలని, చల్లని నీటితో శరీరాన్ని తుడవాలనీ, వీలైనంత గాలి తగిలే విధంగా జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.






