5 April, 2026 | 4:09 AM

డంప్ యార్డ్ పాపం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లదే

05-04-2026 12:21 AM
  1. హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు బీజేపీ వ్యతిరేకం
  2. జనావాసాల మధ్యలో ఏర్పాటు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
  3. ప్రజల ఆందోళనకు సంపూర్ణ మద్దతిస్తున్నాం
  4. కేంద్ర మంత్రి బండి సంజయ్
  5. బీజేపీ నేతలతో కలిసి డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి

హుజీరాబాద్ ఏప్రిల్ 4(విజయక్రాంతి): హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. శనివారం హుజూరాబాద్ కు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డితోపాటు స్థానిక బీజేపీ నేతలతో కలిసి సిర్సపల్లి, రంగాపూర్ సమీపంలోని డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించారు.

రోడ్డుకు ఆనుకున్న ఉన్న స్థలం లో హుజూరాబాద్ మున్సిపాలిటీ శివారు ప్రాంతమైన సిర్సపల్లి, రంగాపూర్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తుండటంతో హుజూరాబాద్ ప్రజలకు తీవ్రమైన హానీ చేకూరే ప్రమాదముందని ఈ సందర్భంగా స్థానికులు బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ హుజూరాబాద్ ప్రజల ఆందోళనను అర్ధం చేసుకుని చెత్త డంపింగ్ యార్డ్ స్థలాన్ని జనావాసాలు లేని ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశా రు.

లేనిపక్షంలో హుజూరాబాద్ ప్రజలతో కలిసి బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. హుజూరాబాద్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలనే పాపం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలకులు చేసిన తప్పిదమేనని మండిపడ్డారు. గత పాలకులు ఇక్కడే డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తే... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరణలోకి తీసుకువచ్చిందన్నారు.

ఆనాడు డంపింగ్ యార్డును హుజూరాబాద్ సమీపంలోనే ఏర్పాటు చేయాలని చెప్పిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులే ఈరోజు అందుకు భిన్నంగా ఆందోళనలు చేయడం సిగ్గు చేటన్నారు. డంపింగ్ యార్డు ప్రాంతంలోనున్న గుట్టల్లో నెమళ్లు, పక్షులుసహా నిత్యం వన్యప్రాణులు సంచరిస్తున్నాయని చెప్పారు. ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తే వన్యప్రాణులు చచ్చిపోతాయని, దీంతోపాటు మనుషుల ఆరోగ్యాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

హుజూరాబాద్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నీ బీజేపీ వ్యతిరేకిస్తుంది అన్నారు. నిజానికి ఇక్కడ డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేయాలని ప్ర తిపాదించింది గత పాలకులు. ఈ ప్రతిపాదనను ఆచరణలోకి తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల సమయం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుమ్లాపూర్ సభలో ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తే... మొట్టమొదట వ్యతిరేకించింది నేనే.

ఆనాడు ఏ ఒక్కరూ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. అయినా ఈరోజు సిగ్గు లేకుండా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయడం ఆశ్యర్యం కలిగిస్తోంది అన్నారు.  ఆనాడే డంపింగ్ యార్డు ప్రతిపాదనను వ్యతిరేకించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే పాపానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు బాధ్యత వహిం చాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని బండి సంజయ్ కోరారు.  

రథోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి

అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇల్లందకుంట మండల కేంద్రానికి వెళ్లారు. శ్రీ సీతారామచంద్రస్వా మి రథోవ్సంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. ఉత్సవ నిర్వాహకులు కేంద్ర మంత్రిని గజమాలతో ఘనంగా సత్కరించారు.