5 April, 2026 | 4:23 AM

మహంకాళికి కట్టెల గుడి

05-04-2026 12:35 AM
  1. అడవిలో నేలకొరిగిన టేకు చెట్ల కర్రలతో ఆలయ నిర్మాణం
  2. నేపాల్ పశుపతి ఆలయం మాదిరిగా..
  3. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట్ గ్రామంలో..

(ఉట్నూర్, విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వాయిపేట్ గ్రామంలో మహంకాళి అమ్మవారికి కట్టెలతో ఆలయాన్ని నిర్మించారు. గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో వెలసిన అమ్మవారికి ఆలయ పూజారి కినక శంభు మహారాజ్. నేపాల్ దేశంలోని పశుపతి ఆలయాన్ని కర్రలతో నిర్మించడాన్ని ఆయన స్వయంగా వెళ్లి పరిశీలించారు.

వాయిపెట్‌లో కూడా మహంకాళి అమ్మవారికి కర్రలతో ఆలయం నిర్మించాలని తలచి.. టేకు కర్రలతో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. అడవిలో చెట్లను నరకకుండా నేలకొరిగిన టేకు చెట్ల నుంచి మాత్రమే కర్రలను సేకరించి ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. నేడు ఈ ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 

వ్యవసాయ క్షేత్రంలో అమ్మవారు

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట్ గ్రామానికి కిలోమీటర్ దూరంలో కినక రాము వ్యవసాయ క్షేత్రంలో మహంకాళి అమ్మవారు వెలిశారు. దేవతా పూజారిగా కినక శంభు మహారాజ్  పూజలు చేయడం ప్రారంభించారు. అమ్మవారు వెలసిన విషయం తెలుసుకుని భక్తులు రావడం ప్రారంభించారు. మహంకాళి దేవతకు మొక్కుకున్న వారికి కొంగుబంగారంగా మారి కోరికలు తీర్చడంతోపాటు అనారోగ్యానికి గురైన వారికి శంభు మహారాజ్ చెట్ల మందులు  ఇవ్వడంతో భక్తుల తాకిడి పెరిగి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల భక్తులతో పాటు మహారాష్ట్ర, ఏపీ తదితర రాష్ట్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం భక్తులు తరలివస్తున్నారు. మహంకాళి దేవత వద్దకు వచ్చే భక్తులకు మహంకాళి దేవత కొంగుబంగారంగా  వారి కోరికలు తీర్చడంతో రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుంది. సంతానం కాని వారు సైతం మహంకాళి దేవత వద్దకు వచ్చి మొక్కుకుంటున్నారు. 

నాడు భయం భయం.. నేడు ఆధ్యాత్మికం

సరిగ్గా 21 ఏళ్ల క్రితం దట్టమైన అడవిలో ఉన్న వాయిపేట్ గ్రామానికి వెళ్లాలంటే ప్రాణాలను అరచేతులో పెట్టుకోవాల్సిందే. అడవి ప్రాంతంలో ఎప్పుడేం జరుగుతుందోనని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా  ప్రజలతోపాటు ఉమ్మడి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సైతం ఈ గ్రామంపై డేగ కన్ను పెట్టేది. ఈ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని రాత్రి పగలు తేడా లేకుండా పోలీసుల ప్రత్యేక దళాలు సంచరించేవి.

మావోయిస్టులు సైతం ఈ ప్రాంత గ్రామాల్లో తిరుగుతూ.. గిరిజన గ్రామాల్లో చైతన్య సభలు నిర్వహించేవారు. కానీ మహంకాళి అమ్మవారు వెలియడంతో ప్రస్తుతం ప్రతి వారం వందలాది వాహనాలు, వేలాది మంది భక్తులు వాయిపేట్ గ్రామానికి తరలివస్తున్నారు. నాడు భయం భయంగా ఈ గ్రామాని వచ్చే ప్రజలు.. నేడు అమ్మవారి దర్శనానికి తరలిస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా నేడు వాయిపేట్ గ్రామం విలసిల్లుతున్నది.

నేపాల్ పశుపతి ఆలయం మాదిరిగా నిర్మాణం 

నేపాల్ దేశంలోని పశుపతి ఆలయాన్ని కినక శంభు మహారాజ్ స్వయంగా అక్కడికి వెళ్లి తిలిపించారు. ఆ ఆలయాన్ని కర్రలతో నిర్మించడాన్ని గమనించి.. మహంకాళి దేవతకు కూడా టేకు కర్రతో నిర్మించాలని శంభు మహారాజ్ నిర్ణయించారు. నిర్ణయం మేరకు అడవిలోని చెట్లను నరకుండా కేవలం నేలకొరిగిన టేకు చెట్ల నుంచి కర్రలను సేకరించి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. భక్తులు కూడా టేకు కర్రలను సమకూర్చారు.

టేకు కర్రను  ఉపయోగించి ఆలయం నిర్మించడం ఉమ్మడి  రాష్ట్రంలోనే ప్రథమం. దేవత మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన  భక్తులు ముందుగా కర్రతో నిర్మించిన ఆలయాన్ని పరిశీలిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కర్ర ఆలయం నిర్మించాడాన్ని కొనియాడుతున్నారు.

 బండారి లక్ష్మి నర్సయ్య