16 March, 2026 | 4:35 AM

నాలుగు రాషాల ఎన్నికలకు నగారా

16-03-2026 01:26 AM
  1. అసోం, కేరళం, తమిళనాడు, బెంగాల్ షెడ్యుల్ విడుదల
  2. బెంగాల్‌లో రెండు విడతల్లో ఎలక్షన్.. మిగిలిన రాష్ట్రాల్లో ఒకే విడత
  3. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికీ ఎన్నికలు
  4. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీనే..
  5. వివరాలు వెల్లడించిన సీఈసీ జ్ఞానేశ్‌కుమార్


న్యూఢిల్లీ, మార్చి ౧౫: కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం సహా కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్‌ను ఆదివారం ప్రకటించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

షెడ్యూ ల్ విడుదలైన తక్షణం ఆయా రాష్ట్రాలు, యూటీలో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఐదు రాష్ట్రాలూ కలిపి మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మే 4న జరుగుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 326వ అధికరణం ప్రకారం ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను పూర్తి చేశామని జ్ఞానేష్ కుమార్ తెలిపారు.

అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈసీ పని చేస్తుందని వివరించారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుం డా జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. పారదర్శకమైన ఓటరు జాబితానే నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది అని ఆయన అభివర్ణించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

యువ త, తొలిసారి ఓటేసే యువతీ యువకులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొ నాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటి వసతి, మరుగుదొడ్లు, దివ్యాంగుల కోసం ర్యాంప్ లు వంటి వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపరు. సమావేశంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్‌జోషి పాల్గొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో రెండు విడతలు

పశ్చిమ బెంగాల్‌లో ఈసీ ఈసారి రెండు విడతల్లోనే ఎన్నికలు నిర్వహించనుంది. ఏప్రిల్ 23 తొలి విడత పోలింగ్ నిర్వహించనుండగా, ఇదే నెల 29న రెండో విడత పోలింగ్ నిర్వహించనుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 8 విడతల్లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఎన్నికలకు ఖర్చెక్కువైంది. ఈ సారి తగ్గించడంతోపాటు ప్రజలకు సౌలభ్యం కోసం రెండు విడుతల్లోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించి నట్లు ఈసీ వెల్లడించింది. రాష్ర్టంలో మొత్తం 294 నియోజకవర్గాలు ఉండగా, పోలింగ్ 80 వేల కేంద్రాలను ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ అధికార పార్టీ టీఎంసీ, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ.

తమిళనాడులో ఒకే విడత

తమిళనాడులో ఏప్రిల్ 23న పో లింగ్ జరుగనుంది. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఒకే విడతలో ఎన్నికలు ముగియనున్నాయి. ఇక్కడ డీఎంకే- -కాంగ్రెస్ కూటమి, ఏఐఏడీఎంకే, బీజేపీ, టీవీకే బరిలో నిలువనున్నాయి.

కేరళంలోనూ ఒకే విడత

కేరళంలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 2.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార ఎల్‌డీఎఫ్ కూటమి ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మడమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. సీపీఎం 86 స్థానాల్లో బరిలోకి దిగనుంది. వీటిలో 56 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం దక్కింది. మాజీ మంత్రి కేకే శైలజా పేరవూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమి కూడా సీట్ల సర్దుబాటును వేగంగా పూర్తి చేసే పనిలో పడింది.

అసోంలో ఒకే విడత

అసోంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనుంది. ఈ రాష్ట్రంలోనూ ఒకే విడతలో పోలింగ్ పూర్తికానుంది. రాష్ర్టంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే 14 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. బ్రహ్మపుత్ర వ్యాలీ ప్రాంతంలోని స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. 

పుదుచ్చేరిలో ఒకే విడత

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఐదు స్థానాలు ఎస్సీలకు ఖరారయ్యాయి. అధికార ఏఐఎన్‌ఆర్సీ-బీజేపీ కూటమి, ప్రతిపక్ష డీఎంకే గ్రెస్ కూటమి మధ్య ఇక్కడ గట్టి పోటీ. 

కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు

ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌నూ ఈసీ ప్రకటించింది. గుజరాత్, మహారాష్ట్రలోని స్థానాలకు ఏప్రిల్ 23న, గోవా, కర్ణాటక, త్రిపురలోని స్థానాలకు ఇదే నెల 29న ఎన్నికలు జరుగనున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు సైతం మే 4వ తేదీనే విడుదల కానున్నాయి.