16 March, 2026 | 1:15 PM

ప్రభుత్వాసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం: 10 మంది మృతి

16-03-2026 10:22 AM

భువనేశ్వర్: ఒడిశాలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. కటక్ లోని ఎస్సీబీ(SCB Hospital fire) వైద్య కళాశాల ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఆస్పత్రి అత్యవసరన విభాగంలోని ట్రామా కేర్ ఐసీయూలో అర్ధరాత్రి మంటలు అంటుకున్నాయి. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ(Mohan Charan Majhi) ఘటనాస్థలిని పరిశీలించి బాధితులను పరామర్శించారు. రోగులను సురక్షితంగా కాపాడే క్రమంలో ఆసుపత్రి సిబ్బందిలో సుమారు 11 మందికి కాలిన గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ట్రామా కేర్ ఐసియు, పక్కనే ఉన్న వార్డులో 23 మంది రోగులు ఉన్నట్లు సమాచారం.

ఏడుగురు రోగులు అగ్నిప్రమాదంలో మరణించారని, మరో ముగ్గురు కాలిన గాయాలతో ఆస్పత్రికి తరలించే సమయంలో ఊపిరాడక మరణించారని అధికారులు చెప్పారు. ఒడిశా సీఎం మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పన ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అగ్నిప్రమాదంలో 10 మంది రోగులు మరణించిన ఘటనపై ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రిని సందర్శించనున్నారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.