16 March, 2026 | 5:03 AM

నెతన్యాహు సురక్షితమే!

16-03-2026 01:01 AM
  1. ఇజ్రాయెల్ ప్రధాని మృతి చెందినట్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు
  2. ఫేక్ న్యూస్ అని ప్రకటించిన పీఎంవో
  3. బతికుంటే చంపేస్తాం: ఐఆర్జీసీ వార్నింగ్

టెల్ అవీవ్, మార్చి 15 : ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సురక్షితంగా ఉన్నారని ప్రధాన మంత్రి కార్యాల యం(పీఎంఓ) స్పష్టం చేసింది. అయితే నెతన్యాహు హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్‌లపై ప్రధాని కార్యాలయం అధికారికంగా ఖండించింది. ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని, ప్రధాని క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. కొద్ది రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, ఇరాన్ క్షిపణి దాడుల్లో నెతన్యాహు మృతిచెందినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అ య్యాయి.

ఓ వీడియోలో నెతన్యాహు చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడంతో, అది ఏఐతో సృష్టించారని, అసలైన ప్రధాని చనిపోయారని కొందరునెటిజన్లు చర్చలు జరి పారు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించింది. ప్రధాని క్షేమంగా ఉన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ ఫేక్ న్యూస్ అని పీఎంఓ ప్రకటించింది. అలాగే, నెతన్యాహు ఇవాళ దేశ భద్రతామండలి అధికారులతో సమావేశమైన ఫొటోలను సైతం అధికారులు విడుదల చేశారు.

అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరణించలేదంటూ ఇజ్రాయెల్ పీఎంఓ రిలీజ్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ఒకవేళ ఆయన బతికే ఉంటే వేటాడి మరీ చంపేస్తామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్ (ఐఆర్జీసీ) హెచ్చరించింది. నెతన్యాహు నేరస్తుడైన జియోనిస్ట్ ప్రధాని అని, ఒకవేళ ఆయన ప్రాణాలతో ఉంటే వేటాడి చంపేస్తామని హెచ్చరించింది. 

ఇదిగో నాకు పది వేళ్లే!

తాను క్షేమంగానే ఉన్నానంటూ ‘ఇదిగో నాకు పది వేళ్లే ఉన్నాయ్’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరో వీడియోను రిలీజ్ చేశారు. తనపై వచ్చిన మృతి వదంతుల వీడియోలపై ఆయన స్పందిస్తూ నవ్వుతూ.. రెండు చేతులు పైకెత్తి వేళ్లను పత్య్రేకంగా చూపించారు. దీంతో ఆయన మరణించినట్లు వైరల్ అవుతున్న వీడియోల వదంతులకు చెక్‌పెట్టారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తాను బతికే ఉన్నానని, తన విధులను కొనసాగిస్తూ వీడియోలో కన్పించారు.

దీంతో ఆయనపై సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నకిలీవని తేలిపోయింది. తాజా వీడియోలో ఇజ్రాయెల్ ప్రధాని తన రెండు చేతులను కెమెరా వైపుకు ఎత్తి, తనకు పది వేళ్లు ఉన్నాయని చూపించారు. శనివారం ముందుగా, బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం కూడా వైరల్ అయిన సోషల్ మీడియా వాదనలను తోసిపుచ్చింది. అవి నకిలీ వార్తలని, ప్రధానమంత్రి క్షేమంగా ఉన్నారని పీఎంఓ తెలిపింది.