ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి: మాజీ డిప్యూటీ స్పీకర్
మెదక్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడిచిపెట్టి తక్షణమే చర్చలు ప్రారంభించి, కార్మికుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ డిమాండ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మెదక్ ఆర్టీసీ డిపో గుల్షన్ క్లబ్ వద్ద కొనసాగుతున్న కార్మికుల రెండొవ రోజు సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులతో కలసి ర్యాలీగా డిపో వరకు వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ హామీలు అన్ని గంగలో కలిసాయని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలు కాకుండా తూతూమంత్రంగా పరిపాలన సాగుతోందని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సమ్మె కొనసాగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ, సరైన గుర్తింపు ఇచ్చి గౌరవాన్ని కాపాడారని గుర్తు చేశారు.
ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రభుత్వంలో విలీనం, పీఆర్సీ ఫిట్మెంట్ వంటి హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. దీనివల్ల కార్మికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా కార్మికులను కూడా పట్టించుకోకుండా అరెస్టు చేసి పాపన్నపేట్ పోలీస్ స్టేషన్కు తరలించడం పట్ల తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని, వారి న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా వాయిదాలు వేయడం వల్ల కార్మికుల్లో ఆందోళన పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకలైన ఆర్టీసీ కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం తగదని, ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మెన్ మల్లికార్జున్ గౌడ్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యం.లావణ్య రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, న్యాయవాది జీవన్ రావు, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిల్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు సోహెల్ జుబేర్, దీపక్ కుమార్, మెదక్ మాజీ వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులు, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి, నాయకులు గడ్డమీద కృష్ణ గౌడ్, లింగారెడ్డి, సురేందర్ గౌడ్, వెంకటేశం, కాశినాథ్ రావు, అంజి రెడ్డి, వేణు, సాయికుమార్, రంజిత్, స్వామి నాయక్, యంబిపూర్. మహేష్, చంద్ పాషా, ఆర్టీసీ జేఏసీ జేఏసీ నాయకులు ఏంఆర్కే రావు, ఆర్టీసీ కార్మికులు,సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు..






