తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది
- మోడీ–రేవంత్ తీరుపై వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శలు
గజ్వేల్: తెలంగాణను మరోసారి కరువు రాష్ట్రంగా మార్చే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1995 నుంచి 2004 వరకు తెలంగాణ తీవ్ర కరువుతో ఎడారిలా మారిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కాలేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందించారని అన్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టులపై తప్పుడు నివేదికలు తయారు చేసి వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలో భాగమేనని విమర్శించారు. ఎల్ నీనో వల్ల రాష్ట్రంలో వర్షాలు పడకపోవడంతో మళ్లీ కరువు ఏర్పడే పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. రైతులంతా ఆకాశం వైపు ఆశగా వర్షం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కేవలం రూ.200 కోట్లతో మరమ్మతులు చేస్తే ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావచ్చని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
ప్రాజెక్టులను నీటితో నింపితే రూ.30 వేల నుండి రూ.40 వేల కోట్ల విలువైన పంటలు పండిస్తారని, రైతుల పంట కొనాల్సి వస్తుందని ప్రాజెక్టులు నింపడం లేదన్నారు. కెసిఆర్ తెలంగాణ బిడ్డ అని అందుకే ప్రాజెక్టుల నిర్మించి రాష్ట్రానికి సస్యశ్యామలం చేశారని, రేవంత్ రెడ్డి ఆంధ్రాకు అమ్ముడుపోయిన వ్యక్తి అన్నారు. ప్రాజెక్టులను నీటితో నింపకుండా ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఈ నెల శుక్రవారం కొండపోచమ్మ, మల్లన్నసాగర్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు.






