18 June, 2026 | 3:11 AM

సహ చట్టాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలి

18-06-2026 12:25 AM
  1. సమాచార హక్కు చట్టంపై అధికారులకు అవగాహన ఉండాలి
  2. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి

మంచిర్యాల, జూన్ 17 (విజయక్రాంతి) : సమాచార హక్కు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని, ప్రభుత్వ శాఖ లు అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో రాష్ట్ర సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు, మొహ్సినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి ఎగ్గడి భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ లతో కలిసి జిల్లా అధికారులకు స మాచార హక్కు చట్టం2005 సమర్థవంతం గా అమలు, ప్రజలకు సమాచారాన్ని సకాలంలో అందించడం, చట్టంలోని నిబంధ నలను ఖచ్చితంగా పాటించడం వంటి అం శాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ప్రజలకు స మాచారాన్ని పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందించడం ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యత అని, సమాచార హక్కు చట్టం లక్ష్యాలను సాధించేందుకు అధికారులు చట్ట నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రజాస్వా మ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే శక్తివంతమైన సాధనమని, చట్టం ప్రకారం 30 రోజులలోపు సమాచారం ఇవ్వాలని, గడువు దా టితే సమాచారాన్ని ఉచితంగా అందించాల్సి ఉంటుందని తెలిపారు.

సమావేశంలో జిల్లాలోని అన్ని శాఖల ప్రథమ అప్పీళ్ల అధికా రులకు, ప్రజా సమాచార అధికారులకు, సహాయ ప్రజా సమాచార అధికారులకు సమాచార హక్కు చట్టం2005 లోని ముఖ్యమైన నిబంధనలు, దరఖాస్తుల పరిష్కారా నికి సంబంధించిన కాలపరిమితులు, అప్పీళ్ల నిర్వహణ, సమాచారాన్ని అందించడంలో పాటించాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పించారు. ప్రతి అధికారి సమాచార హక్కు చట్టంలోని అన్ని నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, అందిన ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించాలని, సమాచార హక్కు చట్టాన్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయరాదని, అత్యున్నత ప్రాధాన్యతతో అమలు చేయాలని తెలిపారు.

కమిషన్ ముందు అప్పీళ్ళ పరిష్కార సమయంలో ప్రజా సమాచార అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ అందించిన సలహాలు, సూచనలు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. 

సమాచార హక్కు చట్టం అమలులో మరింత సమర్థవంతంగా పని చేసి ప్రజలకు సత్వర సేవలు అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లాలోని పెండింగ్ లో ఉన్న అప్పీళ్ళ దరఖాస్తులను ప్రభుత్వ శాఖల వారీగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్ డీ ఓ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, వివిధ శాఖల ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీలేట్ అథారిటీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.