ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
కలెక్టర్ భవేశ్ మిశ్రా
భైంసాజూన్ 17 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. బుధవారం కుంటాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బడికి హాజరుకాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా చూడాలని ఆదేశించారు.
పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తూ, అపరిశుభ్రతపై అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్, చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కూడా అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులకు లెక్కలు చేయించి, పలు ప్రశ్నలు అడిగి వారి ప్రతిభను పరీక్షించారు. పాఠ్యాంశాలతో పాటు విద్యార్థుల నైపుణ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పాఠశాల ప్రాంగణంలోని ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించి మెరుగైన విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. వసతి గృహాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆదేశించారు.అనంతరం కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలు, రికార్డులను పరిశీలించారు. కాలానుగుణ వ్యాధుల నేపథ్యంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం అందకూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించి, చిన్నారులతో ముచ్చటించారు. విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీడీఓ వనజ, మండల విద్యాధికారి ముత్యం, సర్పంచ్ గజేందర్ తదితరులు పాల్గొన్నారు.






