13 July, 2026 | 2:24 AM

టీఆర్పీ సరికొత్త రాజకీయం

13-07-2026 01:58 AM
  1. భువనగిరి సమరభేరితో మొదలైంది
  2. 2028లో అధికారం బీసీలదే 
  3. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీకి స్థానం ఉండదు
  4. జూలై 15 నుంచి 31 వరకు టీఆర్పీ ప్రత్యేక సభ్యత్వ డ్రైవ్
  5. టీఆర్పీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జూలై 12: భువనగిరిలో నిర్వహించిన ‘రాజ్యాధికార సమరభేరి’ మహాసభతో తెలంగాణ రాజకీయాల్లో సరి కొత్త అధ్యాయం ప్రారంభమైందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. 2028లో అధికారం బీసీలదేన ని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీకి స్థానం ఉండదని స్పష్టం చేశారు. జూలై 15 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్పీ ప్రత్యేక సభ్యత్వ నమోదు డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రతి జిల్లాలో సమరభేరి తరహా భారీ సభలు నిర్వహిస్తామని తీన్మార్ మల్లన్న చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో భువనగిరి సభ విజయం పై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అంతేకాదు పార్టీ విస్తరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, జూలై 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.

ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి వార్డులో సభ్యత్వ నమోదు ఉద్యమంలా సాగాలని సూచిం చారు. పార్టీని గ్రామ స్థాయి వరకు విస్తరించడమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యమన్నారు. గ్రామ, మండల, పట్టణ, బూత్ కమిటీలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ఇన్చార్జులు తమకు కేటాయించిన జిల్లాల్లో పూర్తి సమయం కేటాయించి పనిచేయాలని, జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు.

భువనగిరి సభ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు ఆశగా చూస్తున్నాయని మల్లన్న తెలిపారు. టీఆర్పీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయ పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు టీఆర్పీ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నట్లు విశ్వసనీయ సమాచారం తమకు అందిందని మల్లన్న పేర్కొన్నారు.

అయితే కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భువనగిరి సమరభేరి విజయాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఇదే స్థాయిలో భారీ ప్రజాసభలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సమావేశం ప్రారంభంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీకుమార్‌యాదవ్ భువనగిరి రాజ్యాధికార సమరభేరి విజయంపై సమీక్ష అజెండాను ప్రవేశపెట్టారు.

ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు గంగాధర్ లింగాల, వేములవాడ మదన్ మోహన్‌చారి, జ్యోతి పండేల్, కోశాధికారి కొక్కల కొండ మనోజ్, ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, ఆకుల హనుమాన్లు, కోమల మంజుల గౌడ్ మహిళా విభాగం అధ్యక్షురాలు పటేల్ వనజ, రైతు విభాగం అధ్యక్షుడు మారమని పాండుగౌడ్, కార్మిక విభాగం అధ్యక్షుడు సంకూరి శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ మనోజ్ ఆకుల, యువజన విభాగం అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్,

విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎంఎల్ రాజుగౌడ్, మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఎండీ సల్మాన్, రాష్ట్ర కార్యదర్శులు రమేష్‌యాదవ్, నగేష్ ముదిరాజ్ ,శివవీర్‌రెడ్డి, అఖిల్ పాషా, పసల ప్రసన్న, కొమ్ముల ప్రవీణ్‌రాజ్, కడారి శ్రీనివాస్, గట్ల రాజన్న, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్యగౌడ్, సహాయ కార్యదర్శులు ఉడుగులు ఐలయ్య యాదవ్, గిరిగాని బిక్షపతిగౌడ్, గడ్డం కృష్ణ, రవిముదిరాజ్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులు బత్తిని మీనాగౌడ్, కర్రు పావని, క్రమశిక్షణ కమిటీ మహిళా చైర్‌పర్సన్ పుష్పలీల, స్టేట్ ఆఫీస్ కోఆర్డినేటర్ లింగంయాదవ్ పాల్గొన్నారు