కాంటినెంటల్ వాయిస్ అండ్ పెర్ఫార్మెన్స్ క్లినిక్
ప్రారంభించిన ప్రముఖ సంగీత దర్శకులు ఎమ్‌ఎమ్ కీరవాణి
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్‌లో ఆదివారం కాంటినెంటల్ వాయిస్ అండ్ పెర్ఫార్మెన్స్ క్లినిక్‌ను ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు, ఆస్కార్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ శ్రీ ఎమ్‌ఎమ్ కీరవాణి, ప్రముఖ గాయని పద్మశ్రీ శోభరాజ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై కాంటినెంటల్ వాయిస్ అండ్ పెర్ఫార్మెన్స్ క్లినిక్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్‌ఎమ్ కీరవాణి మాట్లాడుతూ స్వర సంరక్షణకు సరికొత్త ప్రొఫెష నల్ వాయిస్ సెంటర్‌ని ఆవిష్కరించడం సం తోషంగా ఉందన్నారు. గాయకులుగా లేదా స్వరం కీలక పాత్ర పోషించే ఏ వృత్తిలోనైనా రాణించాలంటే సరైన మార్గదర్శకత్వంలో వాయిస్ ట్రైనింగ్ ఎంతో అవసరమన్నారు.
కాంటినెంటల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువమంది మాత్రమే తమ స్వరాన్ని మెరుగుపర్చుకునేందుకు ప్రొఫెషనల్ వాయిస్ లేదా స్పీచ్ కోచింగ్ తీసుకుంటున్నారన్నారు. గానం అనేది సాధన ద్వారా మెరుగుపరచుకోగలిగే శారీరక నైపుణ్యం. జన్యుపరమైన అంశాలు స్వరతంత్రుల పరిమాణం, ఆకారం, సహజ స్వరస్థాయిని నిర్ణయించినప్పటికీ, ఒక వ్యక్తి ఎంత స్థాయికి ఎదగగలడో అవి నిర్ణయించవు అన్నారు.
భారతదేశంలో మెదడు పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) నుంచి కోలుకున్న వారిలో కేవలం రెండు శాతం మందికే అధికారిక స్పీచ్ థెరపీ అందుతుండగా, ప్రతి నలుగురిలో ఒకరికి మాత్రమే నిపుణుల పర్యవేక్షణలో పునరావాస సేవలు అందుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి భిన్నంగా అమెరికాలో 70 నుంచి 80 శాతం మంది స్ట్రోక్ రోగులు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీతో కూడిన మల్టీస్టెప్స్ న్యూరో-రీహాబిలి టేషన్ సేవలను పొందుతున్నారని వివరించారు. ఈఎన్టీ నిపుణులు, లారింజాలజిస్టులు, ఫోనోసర్జన్లు డాక్టర్ దుష్యంత్ గణేసుని, డాక్టర్ రేష్మి అన్నా అలెక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాస్త్రీయ వివరణలు, వీడియో ప్రదర్శనలతో ఆసక్తికరమైన అవగాహన కల్పించారు.






