3 April, 2026 | 3:55 AM

మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

03-04-2026 12:16 AM

సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు కొనసాగించాలి 

ప్రజల వినతులను స్వీకరించేందుకే ప్రజాపాలన సభలు 

ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్ రూరల్, ఏప్రిల్ 2: మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి రూ.10 వేల కోట్ల మేర ఆదా చేసుకున్న సందర్భంగా గురువారం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించిందని ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఖర్చును ప్రభుత్వం చెల్లించడం ద్వారా ఆర్టీసీకి ఆర్థికంగా బలమిచ్చినట్లు పేర్కొన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.8.98 కోట్లు ఆర్టీసీకి చెల్లించిందని తెలిపారు. అనంతరం సర్దార్ స్వరాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా పాత మార్కెట్ యార్డ్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మోహన్ గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పకిరయ్య గౌడ్, జిల్లా అధ్యక్షుడు మల్లయ్య గౌడ్ లతోపాటు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన  పట్టణ ప్రగతి వార్డ్ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించడం కోసమే ప్రజా పాలన గ్రామ వార్డు సభలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రజల సమస్యలు, అభివృద్ధి అవసరాలు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధిదీపాలు వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. వార్డ్ స్థాయిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, రోడ్ రవాణా శాఖ అధికారి బాలు నాయక్, ఆర్టీసీ అధికారులు, కౌన్సిలర్లు శ్రీనివాసులు, మాధవి రాజు, చంద్రకళ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలకపల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు, అభివృద్ధి అవసరాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, ఉపసర్పంచ్ శ్రీనివాసులు, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ యాదయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, స్థానిక నాయకులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.