28 May, 2026 | 3:43 AM

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు సరికాదు

28-05-2026 12:00 AM

ముషీరాబాద్, మే 27(విజయక్రాంతి): ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు నమోదు చేయటం, అరెస్ట్ చేయాలని ప్రయత్నించటం అప్రజాస్వామికం అత్యంత  దుర్మార్గమని, తెలంగాణ  పౌరులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమస్యలపై విశ్లేషణ చేయటం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, భావ ప్రకటనా స్వేఛ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని గుర్తు చేశారు. నాగేశ్వర్ విశ్లేషణలు నచ్చకపోతే ప్రసార మాధ్యమాల ద్వారా ఖండించాలి తప్ప, కేసులు పెట్టి, వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయటం సరికాదని హితవు పలికారు. మౌనంగా సహజీవనం చేస్తున్న తెలుగు రాష్ట్రాల మధ్య ఇటువంటి చర్యలు వైషమ్యాలను కలిగిస్తాయని, తక్షణమే ఏపీ ప్రభుత్వం ఇలాంటి  చర్యలను వెంటనే వెనుకకు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.